ఆ టీడీపీ నేత కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబమే దగ్గరుండి వైసీపీలోకి తీసుకొస్తోందా?

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 04:12 PM IST
ఆ టీడీపీ నేత కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబమే దగ్గరుండి వైసీపీలోకి తీసుకొస్తోందా?

dk family: డీకే ఆదికేశవులునాయుడు అంటే చిత్తూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో సుపరిచితులే. మద్యం మొదలు అనేక వ్యాపారాలతో వేల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టిన ఆయన.. అనేక రాజకీయ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కోశాధికారి మొదలు చిత్తూరు ఎంపీ వరకు అనేక పదవులు అలంకరించారు. ఆయన హఠాన్మరణంతో కుమారుడు శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు తర్వాత కొన్నేళ్లకు డీకే కుటుంబం టీడీపీలో చేరింది. ఇప్పుడు ఈ కుటుంబం అధికార పార్టీ వైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఆ ఓటమితో రాజకీయంగా సైలెంట్ అయిన డీకే కుటుంబం:
2014 ఎన్నికల్లో డీకే ఆదికేశవులు సతీమణి సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులు సైతం వెచ్చించారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు నుంచి మరోసారి బరిలో నిలవాలని ఆమె భావించారు. అయితే, ఆఖరి నిమిషంలో అధినేత చంద్రబాబు ఆమెను రాజంపేట ఎంపీ బరిలో నిలిపారు. అయిష్టంగానే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన సత్యప్రభ… వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి డీకే కుటుంబం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది.

జగన్‌ను కలిసిన సత్యప్రభ కుమారుడు:
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సత్యప్రభ ఏడాదిన్నరగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి డీకే కుటుంబం ఏడాదిన్నరగా దూరంగా ఉంటోంది. ఇటీవల తిరుమల పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను సత్యప్రభ కుమారుడు శ్రీనివాస్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పైగా రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి దగ్గరుండి మరీ డీకే శ్రీనివాస్‌ను జగన్ దగ్గరకు తీసుకెళ్లడంతో చర్చనీయాంశమైంది. దీంతో డీకే ఫ్యామిలీ ఇక వైసీపీలో చేరడం లాంఛనమే అన్న ప్రచారం మొదలైంది.

జగన్ ని డీకే కలవడానికి కారణం ఇదే:
డీకే శ్రీనివాస్ మాత్రం తాను సీఎం జగన్‌ను కలవడం వెనుక రాజకీయ కారణాలేవీ లేవని కొట్టిపారేశారు. టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఆదికేశవులు పని చేసిన కాలంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని బంగారు తాపడం చేయాలన్న ఆలోచనతో ‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం’ పథకం తెరపైకి తెచ్చారు. భక్తుల నుంచి 150 కిలోల బంగారాన్ని సైతం విరాళంగా సేకరించారు. అయితే వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని జగన్‌ని తాను కోరినట్లు శ్రీనివాస్ చెప్పారు.

డీకే కుటుంబం వెనుక పెద్దిరెడ్డి:
డీకే శ్రీనివాస్‌ బయటకు ఏం చెబుతున్నా.. ఆ కుటుంబం వైసీపీలో చేరడం ఖాయమేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు. నిజానికి ఆదికేశవులుకి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సన్నిహితంగా మెలిగిన వారే. డీకే ఆదికేశవులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు కొనసాగాయని అంటారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై రాజంపేట పార్లమెంట్ బరిలో సత్యప్రభ అయిష్టంగానే పోటీ చేశారని టాక్‌. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబమే డీకే కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకువస్తున్నట్టుగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే చిత్తూరు రాజకీయాల్లోనూ పెను మార్పులు తథ్యమని అంటున్నారు.