MANSAS Trust: పెండింగ్ జీతాలు.. మాన్సాస్ ట్రస్టుకు నిరసన సెగ!

విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం చోటు చేసుకుంది. జీతాలు చెల్లించాలంటూ ట్రస్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు కోటలోని కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ట్రస్ట్ ఈవోను చుట్టుముట్టిన ఉద్యోగులు పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

MANSAS Trust: పెండింగ్ జీతాలు.. మాన్సాస్ ట్రస్టుకు నిరసన సెగ!

Mansas Trust

MANSAS Trust: విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం చోటు చేసుకుంది. జీతాలు చెల్లించాలంటూ ట్రస్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు కోటలోని కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ట్రస్ట్ ఈవోను చుట్టుముట్టిన ఉద్యోగులు పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాదాపు 19 నెలల వేతనాలు తమకు రావాలని పేర్కొన్న ట్రస్ట్ ఉద్యోగులు వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాగా, ఈ అంశంపై ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సంచయిత చేసిన ట్వీట్ మరింత చర్చనీయాంశంగా మారింది. మీ అన్నగారి పుట్టిన రోజున ఇలా ఉద్యోగులతో ధర్నా చేయించడం సిగ్గుచేటంటూ సంచయిత పరోక్షంగా అశోక్ గజపతి రాజును ఉద్దేశించి ట్వీట్ చేశారు. అంతకుముందు మాన్సాస్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌, మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతిరాజు 72వ జయంతిని పురస్కరించుకొని, ఆయన భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిల గజపతిరాజు స్థానిక రాజుల స్మృతివనంలో ఆనంద గజపతిరాజు సమాధి వద్ద శనివారం నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఊర్మిళ గజపతి రాజు… ఆనంద గజపతిరాజు ఆశయాలను ముందుకు తీసుకుపోతామన్నారు. ప్రస్తుత మాన్సాస్‌ ట్రస్ట్‌ లో జరుగుతున్న వ్యవహారంపై కూడా ఊర్మిళ స్పందించారు. ట్రస్ట్, కుటుంబంలో జరుగుతున్న అంశాలు దురదృష్టకరమన్న ఊర్మిళ తన తండ్రి ఆనందగజపతిరాజు బతికుండగానే మాన్సాస్‌ ఆడిట్‌ జరిగిందని, తరువాత ఏమైందో తెలియదన్నారు. మరోవైపు సింహాచలం భూములపై కూడా ఏం జరుగుతోందో తెలియదని.. తాను కూడా అందరిలా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని చెప్పారు.