ప్రాణాలైనా అర్పిస్తాం కానీ..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రాణాలైనా అర్పిస్తాం కానీ..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం

Visakhapatnam steel plant : విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమంటున్నాయి. కాసేపట్లో స్టీల్‌ప్లాంట్‌ పరిపాలనా భవన ముట్టడికి పిలుపునిచ్చారు. కేంద్రం ప్రకటన వెలువడిన వెంటనే.. కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. విశాఖ కూర్మన్నపాలెంలో నిరసనకు దిగారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం మొదలైన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కూర్మన్నపాలెం జంక్షన్‌వైపు వచ్చిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజును కార్మిక సంఘాల నాయకులు, అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు, జెండాలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపైనే కేంద్ర ప్రభుత్వ ఆర్డర్‌ ప్రతులను దహనం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కుండ బద్ధలు కొట్టేసింది. ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్‌ ప్రైవేటీకరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్‌ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ… అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పింది.

పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఈ ప్రకటన చేసింది.. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గిడ్డి మాధవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నలకు… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కోసమే స్లీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ ప్రకటించి.. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకే వెళుతున్నట్టు చెప్పారు..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భారత ప్రభుత్వం 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించిందని… జనవరి 27, 2021న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ దీనికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు… అంతేగాకుండా విశాఖ స్టీల్‌కు చెందిన ఇతర అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థల నుంచి కూడా ప్రైవేటైజేషన్ ద్వారా పెట్టుబడులను ఉపసంహరిస్తామన్నారు.