ముగ్గురి హత్యకు పక్కా ప్లాన్‌.. కారులో ఉన్నవారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

  • Published By: bheemraj ,Published On : August 18, 2020 / 07:29 PM IST
ముగ్గురి హత్యకు పక్కా ప్లాన్‌.. కారులో ఉన్నవారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

విజయవాడ భారతీనగర్‌లోని కెనరా బ్యాంక్‌ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్‌ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వారు బయటకు రాకుండా కారు డోర్‌ లాక్‌ చేశాడు. ఈ ఘటనతో బెజవాడలో కలకలం చెలరేగింది.



ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో హత్యకు ప్లాన్‌
వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్‌ వ్యాపారస్తులు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తుంటారు. వేణుగోపాల్‌రెడ్డి…. ఓ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలంటూ… కృష్ణారెడ్డిని, గంగాధర్‌ను, ఆయన భార్య నాగవల్లిని పిలిచాడు. వీరంతా ఒకే కారులో విజయవాడకు బయలుదేరి వచ్చారు. ల్యాండ్‌ను కొనుగోలు చేసే వ్యక్తులు నోవాటెల్‌కు వస్తారని.. అప్పటి వరకు సమయం ఉందంటూ… వేణుగోపాల్‌రెడ్డి కారును భారతీనగర్‌లో ఆపాడు. అక్కడే వారంతా కూర్చుని డీల్‌ గురించి కాసేపు మాట్లాడుకున్నారు.



కారులో ఉన్న ముగ్గురిపై పెట్రోల్‌ చల్లిన వేణుగోపాల్‌రెడ్డి
40 నిమిషాలకుపైగా కారులో కూర్చుని అంతా చర్చించుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాల్‌రెడ్డి కారు దిగాడు. వేణుగోపాల్‌రెడ్డి ముందే బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను కారులో ఉన్న ముగ్గురిపైనా పోశాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకొనే లోపే నిప్పంటించాడు. అంతేకాదు.. కారులో ఉన్నవారు దిగకుండా డోర్స్‌ లాక్‌ చేశాడు. అనంతరం అక్కడి నుంచి వేణుగోపాల్‌రెడ్డి పరారయ్యాడు. ఇదంతా చూస్తుండగానే సినీ ఫక్కీలో జరిగిపోయింది.



ముగ్గురిని రక్షించిన స్థానికులు
ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో గంగాధర్‌, నాగవల్లి, కృష్ణారెడ్డి బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి ముగ్గురిని రక్షించారు. అప్పటికే కృష్ణారెడ్డికి 50శాతంపైగా గాయాలు అయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. గంగాధర్‌, నాగవల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.



కూపీ లాగుతోన్న పోలీసులు
సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. కారు పూర్తిగా మంటల్లో దగ్దమైంది. పోలీసులు సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను పరిశీలించారు. వేణుగోపాల్‌రెడ్డి ముగ్గురిని చంపాలని ఎందుకు ప్లాన్‌ చేశాడన్న దానిపై కూపీ లాగారు.

వేణుగోపాల్‌రెడ్డి, గంగాధర్‌ మధ్య వ్యాపార విబేధాలు
వేణుగోపాల్‌రెడ్డి, గంగాధర్‌ మధ్య వ్యాపార విభేదాలు ఉన్నాయి. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో పిలిచి గంగాధర్‌ను హతమార్చాలని వేణుగోపాల్‌రెడ్డి ప్లాన్‌ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.



వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు
వేణుగోపాల్‌రెడ్డి, గంగాధర్‌ విభేదాలను సెటిల్‌ చెయ్యడానికి మధ్యవర్తిగా వచ్చిన కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. 50 శాతంపైగా శరీరం కాలిపోవడంతో.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.