నా కూతురి ఆత్మకు శాంతి కలగాలంటే వాడు చావాలి, దివ్య తేజస్విని తల్లి

  • Published By: naveen ,Published On : October 17, 2020 / 03:24 PM IST
నా కూతురి ఆత్మకు శాంతి కలగాలంటే వాడు చావాలి, దివ్య తేజస్విని తల్లి

divya tejaswini mother: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కేసు సంచలనం రేపుతోంది. ప్రేమోన్మాది ఘాతుకానికి దివ్య బలైపోయింది. నాగరాజు దివ్యను చంపేశాడని దివ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజు వెర్షన్ మాత్రం మరోలా ఉంది. దివ్య, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, దివ్య తల్లిదండ్రులు కాదనడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని.. ఎవరి గొంతు వారే కోసుకున్నామని చెబుతున్నాడు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. ఎవరి వెర్షన్ కరెక్ట్? ఎవరు నిజం చెబుతున్నారు? అనేది అంతు చిక్కడం లేదు. కాగా, నాగేంద్ర ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తప్పు చేసిన వాడికి ట్రీట్ మెంట్ ఇవ్వడం ఏంటి?
కూతురిని కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ ని కోరుతున్నారు. 10టీవీ ఎక్స్ క్లూజివ్ డిబేట్ లో దివ్య తల్లిదండ్రులు కుసుమ, జోసెఫ్ మాట్లాడారు. నాగేంద్ర చెబుతున్న దాంట్లో వాస్తవం లేదంటున్నారు. నాగేంద్రకు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ ఇవ్వడాన్ని దివ్య తల్లి కుసుమ తప్పు పట్టారు. నాగేంద్రకు బతికే హక్కు లేదన్నారు. నాగేంద్రను శిక్షించాలని డిమాండ్ చేశారు. దివ్యను నాగేంద్ర ప్లాన్ ప్రకారం చంపేశాడని ఆమె ఆరోపించారు. తప్పు చేసిన వాడికి ఇంకా చికిత్స అందించడమేంటి? అని ప్రశ్నించారు. దివ్యను నిజంగా ప్రేమించి ఉంటే, అన్నిసార్లు కత్తితో దాడి ఎలా చేస్తాడని నిలదీశారు. నా బిడ్డను పొట్టన పెట్టుకున్న నాగేంద్రను కఠినంగా శిక్షించాలని కోరారు.

వాడిని వదిలేస్తే మరింత మంది అమ్మాయిలు బలవుతారు:
”వాడిని హాస్పిటల్ లో పెట్టి ఎందుకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఇంకెంతమందిని బలి చేద్దామని వాడిని బతికిస్తున్నారు. మా కుటుంబం మీద ఉసిగొల్పేందుకు వాడిని బతికిస్తున్నారా? దేనికి బతికిస్తున్నారు. నాగేంద్ర లాంటి వాడిని వదిలేస్తే ఎంతో అమ్మాయిలు బలవుతారు. మాకు న్యాయం చేయాలని సీఎం జగన్ ను కోరుతున్నాం. తల్లిదండ్రులుగా మేము కోరుకునేది అదే. మా కూతురిని ఎలాగూ మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు. అల్లారుముద్దుగా పెంచుకున్నాం. మాది పేద కుటుంబం. నా కూతురికి బల్లి అన్నా భయమే. అలాంటి అమ్మాయి 13కత్తి పోట్లను ఎలా తట్టుకుంటుంది. నా కూతురి ఆత్మకు శాంతి కలగాలంటే వాడు చావాలి. మీరు ఎలాగూ నా కూతురిని తీసుకురాలేరు. కనీసం న్యాయం అయినా చేయండి” అని దివ్య తల్లి కుసుమ చేతులు జోడించి వేడుకున్నారు.

విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నది దివ్య కల అని కుసుమ చెప్పారు. దివ్య కలల్ని నాగేంద్ర చిదిమేశాడని కన్నీరుమున్నీరు అయ్యారు. దివ్య చిన్నప్పటి నుంచి చాలా చలాకీగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. దివ్యకు వాళ్ల నాన్నంటే ప్రాణం అని కుసుమ చెప్పారు.

నాగేంద్రతో దివ్య పెళ్లి అవాస్తవం అని దివ్య సోదరుడు దినేశ్ చెప్పాడు. నాగేంద్రతో దివ్యకు ఇటీవల పరిచయం ఏర్పడిందన్నాడు. దివ్య క్యాట్ కు ప్రిపేర్ అవుతోందని తెలిపాడు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న తన చెల్లి దివ్య నాగేంద్ర కిరాతకానికి బలైందని వాపోయాడు. నాగేంద్రకు ఎవరు సహకరించారో పోలీసులు గుర్తిస్తారని చెప్పాడు.

రోజుకో టర్న్, పూటకో ట్విస్ట్:
విజయవాడలో ఇంజనీరింగ్ స్టూడెంట్‌ దివ్య తేజస్విని హత్య కేసు రోజుకో టర్న్, పూటకో మలుపు తీసుకుంటోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యపై దాడి చేసిన నాగేంద్ర రోజుకో వర్షన్ వినిపిస్తుంటే.. దివ్య బతికుండగా తమ మధ్య ఉన్న రిలేషన్‌ మొత్తాన్ని రివీల్ చేసింది. ఇక దివ్య కుటుంబసభ్యులు మాత్రం నాగేంద్ర చెబుతున్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేస్తున్నారు. తమ బిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న నాగేంద్రను ఎన్‌కౌంటర్ చేయాలని నినదిస్తోంది. ఇలా రోజుకో వర్షన్‌ తెరపైకి వస్తుంది. ఇంతకీ ఎవరి వాదనలో ఎంత నిజముంది..? ఇప్పుడందరి దృష్టి పోలీసుల విచారణపైనే పడింది. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

నాగేంద్రను ఎన్ కౌంటర్ చేయాలి:
తన కూతురిని దారుణంగా హత్య చేసిన నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్ చేశారు దివ్య తండ్రి జోసెఫ్‌. తప్పు చేసిన వాడికి ఇంకా చికిత్స అందించడమేంటని ప్రశ్నించారు. దివ్య చనిపోయి మూడు రోజులైనా తమకు న్యాయం జరగలేదన్నారు ఆమె తల్లి కుసుమ. తప్పు చేసిన నాగేంద్రను ఇంకెన్నాళ్లు హాస్పిటల్‌లో పెట్టి చికిత్స చేస్తారని ప్రశ్నించారు. తన చెల్లిని మూడో వ్యక్తి తప్పుదారి పట్టించిందని ఆరోపించాడు దివ్య సోదరుడు. ఆ తర్వాత తానే రియలైజ్ అయిందని వివరించాడు.

నాగేంద్ర ఓ సైకో:
దివ్యపై దాడి చేసిన నాగేంద్ర తానూ గాయపర్చుకున్నాడు. ఆ మరుసటి రోజే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే స్పందించాడు. తాను, దివ్య మూడేళ్లుగా ప్రేమించుకున్నామని.. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ఇద్దరం కలిసే చనిపోవాలని నిర్ణయించుకున్నామని అన్నాడు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయంటూ పెళ్లికి ముందు నాగేంద్రకు ఫోన్‌లో చెప్పింది దివ్య. ఆ ఆడియో కూడా బయటికొచ్చింది. ఇది వరకులా ఉండలేక పోతున్నానని అందులో చెప్పింది దివ్య. ఎవరిని చూసినా అలా ఎందుకు ఉండలేకపోతున్నానో అర్ధం కావట్లేదంటూ నాగేంద్రకు చెప్పిన ఆమె… పెళ్లి తర్వాత అతనో టార్చర్‌ గాడు, సైకో అంటూ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

దివ్యని, నన్ను విడదీశారు:
ప్రేమ పెళ్లి విషయం తెలిసిన తర్వాత దివ్య పేరెంట్స్ తమను విడదీశారని ఆరోపించాడు నాగేంద్ర. అయితే.. దివ్య వర్షన్ మాత్రం మరోలా ఉంది.. రెండున్నరేళ్ల క్రితం నాగేంద్రతో తాను రిలేషన్‌లో ఉన్నానని.. ఆ తర్వాత అతని సైకోయిజం అర్థమైందని వీడియోలో వివరించింది. అప్పటి నుంచి తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉండేవాడంది దివ్య. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే మాట్లాడుతున్న నాగేంద్రపై దివ్య కుటుంబం మండిపడుతోంది. దారుణానికి తెగబడిన అతన్ని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్ చేస్తోంది.

దివ్యను నాగేంద్ర దారుణంగా హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు:
ఆరోపణలు, సందేహాల మధ్య దివ్యను నాగేంద్ర దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. దివ్య-నాగేంద్ర ప్రేమ వ్యవహారం దివ్య ఇంట్లో తెలుసా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు దిశ చట్టం స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌. దివ్యను దారుణంగా చంపడం నేరమేనని.. కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు.