విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, సీఎం జగన్ తో మాట్లాడిన ప్రధాని మోడీ

విశాఖలో కెమికల్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి లీక్ అయిన

10TV Telugu News

విశాఖలో కెమికల్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి లీక్ అయిన

విశాఖలో కెమికల్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి లీక్ అయిన విషవాయువు కారణంగా వేల మంది అస్వస్థతకు గురయ్యారు. పలువురు చనిపోయారు. అనేకమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో విశాఖ సిటీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ఏపీ సీఎం జగన్ తో ఫోన్ లో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఘటన గురించి ప్రధాని ఆరా తీశారు. దుర్ఘటన వివరాలను సీఎం జగన్ ప్రధానికి వివరించారు. ఘటనా స్థలంలో చేపట్టిన సహాయక చర్యలను ప్రధానికి తెలియజేశారు సీఎం జగన్. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా సీఎం జగన్ కు ఫోన్‌ చేశారు. ప్రమాద కారణాలు సహా సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు సీఎం జగన్.

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా:
మరోవైపు ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌, డీజీపీలతో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలపై సమీక్ష జరిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రాణాంతక విషవాయువు లీక్:
ఎల్‌జి పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉంది. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు ఈ పరిశ్రమని మూసి ఉంశారు. కాగా, ఈ కంపెనీని తెరిపించే క్రమంలో గురువారం(మే 7,2020) తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీగా స్టైరిన్ మోనోమర్ అనే రసాయన వాయువు లీక్ అయ్యింది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్పృహ తప్పి రోడ్డు మీదే పడిపోయారు. గ్యాస్ ప్రభావంతో చెట్లు మాడిపోయాయి. మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న 5 ప్రాంతాల ప్రజలపై గ్యాస్ ప్రభావం చూపింది. అధికారులు వారందరిని వేరే ప్రాంతాలకు తరలించారు.

Also Read | విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన మోడీ,రాహుల్