PM Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. మినిట్ టూ మినిట్ అప్‌డేట్..

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని శనివారం ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి తెలంగాణలో మోదీ పర్యటన ప్రారంభమైంది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటల వరకు మోదీ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది.

PM Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..  మినిట్ టూ మినిట్ అప్‌డేట్..

PM Narendar Modi

ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పాల్గొన్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 12 Nov 2022 05:27 PM (IST)

    రామగుండం నుంచి హైదరాబాద్ బయలుదేరిన మోదీ

    తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌ వద్ద బహిరంంగ సభ ముగిసింది. ప్రధాని మోదీ రామగుండం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

  • 12 Nov 2022 05:24 PM (IST)

    ఈ సభను చూస్తే హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు నిద్రపట్టదు: మోదీ

    తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌ వద్ద నిర్వహిస్తున్న ఈ సభను చూస్తే హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు నిద్రపట్టదంటూ టీఆర్ఎస్ నేతలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రామగుండంలో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. తాము ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ‘భారత్ యూరియా’ పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని అన్నారు. నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. తాము అభివృద్ధి పనులు చేస్తుంటే కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

  • 12 Nov 2022 04:59 PM (IST)

    సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు: ప్రధాని మోదీ

    సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందని నిలదీశారు.

  • 12 Nov 2022 04:46 PM (IST)

    అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచాం: మోదీ

    అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని ప్రధాని మోదీ చెప్పారు. దీంతో అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని అన్నారు. తాము ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.

  • 12 Nov 2022 04:40 PM (IST)

    తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రైతులు, తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలని మోదీ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వే జోన్, రోడ్ల విస్తరణ వంటి వాటితో రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు.

  • 12 Nov 2022 04:14 PM (IST)

    2014 నాటికి 2,500 కి.మీ మాత్రమే జాతీయ రహదారులు: కిషన్ రెడ్డి

    తెలంగాణలో 2014 నాటికి 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జాతీయ రహదారుల విస్తీర్ణం దాదాపు 5,000 కిలోమీటర్లకు చేరుకుందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్న ప్రధాని మోది ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కిషన్ రెడ్డి మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యూరియా బస్తాపై రూ.1,472 సబ్సిడీ ఇస్తోందని అన్నారు.

  • 12 Nov 2022 04:07 PM (IST)

    రామగుండం కరీంనగర్ అడ్డా: కిషన్ రెడ్డి

    రామగుండం కరీంనగర్ అడ్డా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్న ప్రధాని మోది ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. రూ.6,300 కోట్లతో ఆర్ఎఫ్సీఎల్‌ను పునరుద్ధరించామని అన్నారు.

  • 12 Nov 2022 04:02 PM (IST)

    ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన మోదీ

    పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. అంతకు ముందు ఆ ఫ్యాక్టరీలో ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. ఆయన వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.

  • 12 Nov 2022 03:37 PM (IST)

    ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న మోదీ

    తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని పరిశీలిస్తున్నారు. ఎరువులు ఉత్పత్తి అయ్యే తీరు గురించి తెలుసుకుంటున్నారు. రామగుండం యూరియా ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు.

  • 12 Nov 2022 03:23 PM (IST)

    రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రామగుండం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఎరువుల ఫ్యాక్టరీకి బయలుదేరారు. కాసేపట్లో ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పరిశీలించి, పలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగం ఉంటుంది. రామగుండంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.

  • 12 Nov 2022 02:43 PM (IST)

    రామగుండం బయల్దేరిన మోదీ

    తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రామగుండం బయలుదేరారు. కాసేపట్లో రామగుండం హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఎరువుల ఫ్యాక్టరీకి చేరుకుని, ఫ్యాక్టరీని మోదీ పరిశీలిస్తారు. ప్లాంట్ సందర్శిం‍చి, జాతికి అంకితం చేస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.

  • 12 Nov 2022 02:11 PM (IST)

    తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు. వారి ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ తెరాస ప్రభుత్వాన్ని ఉద్దేశించి మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూం పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మోదీ విమర్శలు గుప్పించారు.

  • 12 Nov 2022 02:08 PM (IST)

    తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి భరోసానిచ్చింది. తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదేపదే అక్కడ బీజేపీనే అధికారంలోకి వస్తుంది. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ మోదీ అన్నారు.

  • 12 Nov 2022 02:02 PM (IST)

    తెలంగాణలో కుటుంబం ముందు అనే నినాదం నుంచి ప్రజలే ముందు అనే నినాదంతో బీజేపీ పనిచేయాలి. పేదలను దోచుకొనే వారిని వదిలిపెట్టను. కుటుంబ పాలన.. అవినీతి పేదలకు ప్రధాన శత్రువు. అందుకే బీజేపీ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంది అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

  • 12 Nov 2022 02:01 PM (IST)

    అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విచారణల నుంచి బయటపడేందుకు కొంతమంది కూటములుగా ఏర్పడుతున్నారు.

  • 12 Nov 2022 01:55 PM (IST)

    సామాన్యులకు సేవ చేయడానికి ఉన్నమార్గమే రాజకీయం. రాజకీయాలనేవి సేవాభావంతో ఉండాలి. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్లు మోదీని తిట్టడం, బీజేపీని తూలనాడటమే పనిగా పెట్టుకున్నారు.

  • 12 Nov 2022 01:53 PM (IST)

    మోదీని తిట్టేవాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దు. వాళ్లకు నన్ను తిట్టడం తప్ప మరే పనిలేదు. 22ఏళ్లుగా నన్ను చాలా మంది తిడుతూనే ఉన్నారు. సాయంత్రం టీ తాగుతూ ఆ తిట్లను ఎంజాయ్ చేయండి అంటూ బీజేపీ శ్రేణులకు మోదీ సూచించారు.

  • 12 Nov 2022 01:47 PM (IST)

    ఈ నేల ఐటీ విప్లవానికి పురిటిగడ్డలాంటిది. కానీ ఇక్కడి ప్రభుత్వం మూఢ విశ్వాసంతో మునిగిపోయింది. మూఢ నమ్మకాలకు ఈ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. ఎక్కడ నివసించాలి.. ఎవరు మంత్రి మండలిలో ఉండాలి.. ఎవరిని ఉంచాలని మూఢ నమ్మకాలే నిర్ణయిస్తున్నాయి అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

  • 12 Nov 2022 01:43 PM (IST)

    ఒక్క మునుగోడు ఎన్నికకోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దిగివచ్చింది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని బలపరుస్తూ వస్తున్నారు. తెలంగాణ ఎప్పుడూ బీజేపీని ఆదరిస్తూ వస్తోంది. 1984లో బీజేపీ రెండు సీట్లు గెలిస్తే అందులో ఒక సీటు హన్మకొండ రూపంలో తెలంగాణనే అందించింది. ఆ స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా బీజేపీ 300పైగా సీట్లను గెలుచుకుంది. తెలంగాణలో కూడా బీజేపీ సంపూర్ణ విజయం సాధించాలి అని మోదీ అన్నారు.

  • 12 Nov 2022 01:40 PM (IST)

    మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన వాళ్లు ముందుకు వెళ్తున్నారు. కానీ తెలంగాణను వెనకబడేశారు. తెలంగాణలోని ప్రతిభావంతులను వెనకబడేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలకు నిరాశా నిష్ప్రహలతో ఉండీ ఇక్కడి ప్రజలు పోరాటం కొనసాగిస్తున్నారు.

  • 12 Nov 2022 01:36 PM (IST)

    ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోకరంగా ఉంది. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు. వారి పోరాటంతో స్ఫూర్తి పొందుతున్నాను. హైదరాబాద్‌లో కార్యకర్తలను కలిసి వెళ్లాలని బండి సంజయ్ ఆదేశించడంతో కార్యకర్తగా మిమ్మిల్ని కలిసేందుకు వచ్చా. తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాను.

  • 12 Nov 2022 01:33 PM (IST)

    బేగంపేట సభా వేదిక వద్ద ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • 12 Nov 2022 01:31 PM (IST)

    వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చిన మమ్మల్ని అడ్డుకోలేరు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    రాష్ట్ర ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తిస్తోంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెరాస ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బేగంపేట విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ స్వాగతసభ నిర్వహించారు. ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. మహిళ అని చూడకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రోడ్ల మీద ప్లెక్సీలు పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు మళ్లీ మళ్లీ వస్తారు. వెయ్యిమంది కేసీఆర్ లు వచ్చిన మమ్మల్ని అడ్డుకోలేరని అన్నారు.

  • 12 Nov 2022 01:30 PM (IST)

    ప్రధాని నరేంద్ర మోదీ బేగం పేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత సభలో పాల్గొన్నారు.

  • 12 Nov 2022 01:03 PM (IST)

    హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. షెడ్యూల్ కంటే అరగంట ముందే బేగంపేట్ విమానాశ్రయానికి మోదీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.

  • 12 Nov 2022 12:28 PM (IST)

    ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన.. షెడ్యూల్ ఇలా..

    ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా రెండు సభల్లో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు రామగుండంలో ఎన్టీపీసీ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించనున్నారు. అయితే, ఎయిర్ పోర్టు వద్ద తెలంగాణ బీజేపీ ఏర్పాటు  చేసిన సభ కావటంతో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పిస్తారా? లేకుంటే కేవలం రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి బీజేపీ శ్రేణులకు సూచనలు చేస్తూ మాట్లాడతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

    * ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.25కు విశాఖ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
    * మధ్యాహ్నం 1.30 నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుంటారు.
    * మధ్యాహ్నం 2.05 గంటలకు విమానాశ్రయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
    * మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయం నుంచి  రామగుండం బయలు దేరి వెళ్తారు.
    * మధ్యాహ్నం 3.20నిమిషాలకు రామగుండం హెలీప్యాడ్ కు చేరుకుంటారు.
    * 3.30 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా ఎరువుల ఫ్యాక్టరీకి చేరుకుంటారు.
    * 3.30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యాక్టరీని మోదీ పరిశీలిస్తారు.
    * సాయంత్రం 4.15 నిమిషాలకు కార్యక్రమం జరిగే ప్రాంతానికి మోదీ చేరుకుంటారు.
    * సాయంత్రం 4.15నుండి 5.15నిమిషాల వరకు జాతికి అంకితం ఇచ్చే పలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.
    * సాయంత్రం 5.30నిమిషాలకు రామగుండం నుండి బేగంపేట బయలు దేరుతారు.
    * సాయంత్రం 6.30నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకొని, 6.40 నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరుతారు.

  • 12 Nov 2022 12:20 PM (IST)

    మరికొద్ది సేపట్లో తెలంగాణకు ప్రధాని మోదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.

  • 12 Nov 2022 12:16 PM (IST)

    వేదికపై ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీ, జగన్ ముచ్చట్లు ..

    PM Modi and Cm Jagan

    PM Modi and Cm Jagan

    ఆంధ్రావర్సిటీ బహిరంగ సభ వేదిక సాక్షిగా ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రెండు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సభావేదికపైకి వచ్చిన మోదీ.. వేదికపై ఉన్నవారందరినీ పలుకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, సీఎం జగన్ మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మోదీ ఏదో అడుగ్గా సీఎం జగన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇలా కొద్దిసేపు వీరి మధ్య వేదికపైనే చర్చ జరిగింది. దీంతో వారి మధ్య ఏ అంశం చర్చకు వచ్చిందా అనేది ఆసక్తికరంగా మారింది.

  • 12 Nov 2022 11:46 AM (IST)

    ఏపీకి కూడా వందేభారత్ రైలు.. కేంద్ర మంత్రి

    విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. మోదీ నాయకత్వంలో వందేభారత్ రైలు కల సాకారమైంది. త్వరలోనే ఏపీలో కూడా వందేభారత్ రైలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎనిమిదేళ్ల కాలంలో భారతీయ రైల్వేలోని రైళ్లు, ప్లాట్ ఫాంలు, సౌకర్యాల కల్పన మరింత పెరిగిందని తెలిపారు.  రూ. 466 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. రైల్వే స్టేషన్ లలో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

  • 12 Nov 2022 11:36 AM (IST)

    ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తులు..

    విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, అశేష జనం తరపున సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని, విద్య, వైద్యం, సాగు, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధి, గడప వద్దకే పరిపాలన మా ప్రాధాన్యతలు అయ్యాయని అన్నారు. వికేంద్రీకరణ పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా మోదీకి జగన్ పలు విజ్ఞప్తులు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమన్న జగన్.. విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని తెలిపారు. పెద్దలు సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని జగన్ మోదీని కోరారు. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలని, మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం అంటూ సీఎం జగన్ వేదికపై నుంచి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

  • 12 Nov 2022 11:23 AM (IST)

    దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది..

    ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. కానీ భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. సంక్షోభంలో ఉన్న ప్రతిదేశం నేడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని అన్నారు. దేశంలో సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్న ప్రధాని.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. వారికి అన్నివిధాల అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలు విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉచితంగా బియ్యం అందిస్తున్నామని, పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామని ప్రధాని తెలిపారు. యువతకు అంకుర పరిశ్రమల్లో చేయూత అందిస్తున్నామన్నారు.

  • 12 Nov 2022 11:12 AM (IST)

    బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు..

    మౌలిక సదుపాయాల అభివృద్ధికి మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు అనేది ప్రతి నగరానికి చాలా అవసరం. విశాఖలో రైల్వేల అభివృద్ధితో పాటు, ఫిషిరింగ్ హార్బర్ అభివృద్ధి చేస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ప్రధాని మోదీ అన్నారు.

  • 12 Nov 2022 11:05 AM (IST)

    ఏపీ ప్రజలు అందరి బాగుకోసం పాటుపడతారు..

    ఏపీ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. ఇక్కడి ప్రజలు దేశ, విదేశాల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా ఏపీ ప్రజలు ప్రత్యేకతను కనబరుస్తున్నారు. తెలుగు ప్రజలు అందరి బాగుకోసం పాటుపడతారని మోదీ అన్నారు.

  • 12 Nov 2022 10:59 AM (IST)

    మోదీ ప్రసంగంలో వెంకయ్య నాయుడు ప్రస్తావన

    ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి ప్రస్తావించారు. ఏపీ అభివృద్ధికోసం వెంకయ్య నాయుడు ఎంతో కృషిచేశారని అన్నారు. వెంకయ్య, హరిబాబు, నేను ఎప్పుడు కలిసినా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటాం. ఏపీ ప్రజల ఉన్నత వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలుపుతోందని అన్నారు.

  • 12 Nov 2022 10:56 AM (IST)

    విశాఖ దేశంలో ప్రముఖ నగరం..

    ఏపీ ప్రజలు అన్నిరంగాల్లో ప్రత్యేకత చూపిస్తున్నారు. సాంకేతిక, వైద్య రంగాల్లో ఏపీకీ ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖ దేశంలో ప్రముఖ నగరం, ఇక్కడ వ్యాపారం బాగా జరిగేది. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని ప్రధాని అన్నారు.

  • 12 Nov 2022 10:52 AM (IST)

    తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ..

    విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. ప్రియమైన సోదీరీ సోదరులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని.