Polavaram Projectలో కీలక ఘట్టం : తొలి గేటు ఫిక్స్, వీటి..విశేషాలు

Polavaram Projectలో కీలక ఘట్టం : తొలి గేటు ఫిక్స్, వీటి..విశేషాలు

Polavaram Project crest gates : పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)‌ నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి కావడంతో…తొలి గేటును బిగించేందుకు సర్వం సిద్ధం చేశారు ఇంజినీరింగ్‌ అధికారులు. తొలి గేటును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (Polavaram Project Authority) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ (Project Chief Engineer Sudhakar) ఆధ్వర్యంలోని బృందం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే చంద్రశేఖర్ అయ్యర్ బృందం ప్రాజెక్ట్‌లో ఉన్న సమయంలోనే తొలి గేటు ఏర్పాటును పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు.

48 గేట్లు : –
ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేస్తున్న 48 గేట్లను హైడ్రాలిక్ పద్ధతి (Hydraulic Gates)లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. ఈ గేట్లకు 18వేల టన్నుల స్టీల్‌ను వినియోగిస్తున్నారు. గేట్లు పైకి ఎత్తడానికి, కిందకి దించడానికి, వరద నీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్ధతిని (hydraulic crest gates) వినియోగించబోతున్నారు. గేట్ల ఏర్పాటుకు అవసరమైన 98 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.

గేట్ల విశేషాలు : –
ఒక్కో గేటు 20.835 మీటర్లు ఎత్తు, 15.96 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఒక్కో గేట్‌కు 8 ఆర్మ్ గడ్డర్లు..,4 హారిజంటల్ గడ్డర్లు ఉంటాయి. గేటుకు కుడి పక్కన నాలుగు, ఎడమ పక్కన నాలుగు ఆర్మ్ గడ్డర్లు బిగిస్తారు. ఇలా 48 గేట్లకు సంబంధించి 384 ఆర్మ్ గడ్డర్లను, 192 హారిజంటల్ గడ్డర్లు ఉంటాయి. ఒక్కో ఆర్మ్ గడ్డర్ 16 మీటర్లు పొడవు ఉంటుంది. ఆర్మ్ గడ్డర్లు, హారిజంటల్ గడ్డర్లు అసెంబ్లింగ్ చేసిన తరువాత నీటి ప్రవాహాన్ని అడ్డుకునే స్కిన్ ప్లేట్ అమర్చుతారు. ఈ ఆర్మ్ గడ్డర్ల సాయంతో గేట్లకు సంబంధించిన స్కిన్ ప్లేట్‌ను పైకి లేపుతారు. గేట్లను ఎంత ఎత్తుకు తీసుకువెళ్లాలని అనుకుంటే అంత ఎత్తుకు తీసుకువెళ్లడానికి ఈ ఆర్మ్ గడ్డర్లు ఉపయోగపడతాయి.