దుర్గగుడిలో వెండి సింహాల విగ్రహాల చోరీ.. కీలక నిందితుడు అరెస్ట్

దుర్గగుడిలో వెండి సింహాల విగ్రహాల చోరీ.. కీలక నిందితుడు అరెస్ట్

Police arrested a key accused in the theft of 3 silver lion statues : విజయవాడ దుర్గగుడిలో 3 వెండి సింహాల విగ్రహాల చోరీ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి ఈ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. గతంలో సాయి భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలులోని ఆలయాల్లో చోరీలకు పాల్పడటంతో.. 2012లో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతను మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

గత సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన విజయవాడ దుర్గగుడిలో మూడు వెండి సింహాల ప్రతిమలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. రథంపై కప్పిన కవర్లు కప్పినట్లుగానే ఉన్నాయి. కానీ రథంపై ఉన్న సింహాలు మాయం కావడం కలకలం రేపింది. ఉగాది నాడు రథంపై అమ్మవారి ఊరేగిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా..ఉగాది పండుగ నాడు..రథాన్ని ఉపయోగించలేదు. అంతర్వేదిలో రథం కాలిపోయిన ఘటన మరిచిపోకముందే..ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మాయమైన మూడు వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథాన్ని తయారు చేయించారు. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీనికోసం అప్పట్లోనే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు సమాచారం. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది.