రాజధానిపై రెఫరెండం పెట్టండి లేదా ఎన్నికలు పెట్టండి : చంద్రబాబు డిమాండ్

అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 01:11 AM IST
రాజధానిపై రెఫరెండం పెట్టండి లేదా ఎన్నికలు పెట్టండి : చంద్రబాబు డిమాండ్

అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్

రాజధాని మార్పుపై రిఫరెండం నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ కేపిటల్‌ పెట్టుకోవచ్చన్నారు. రిఫరెండం కాకపోతే రాజధాని పేరు చెప్పి తాజాగా ఎన్నికలు పెట్టాలన్నారు. రాజధాని మార్పునకు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేస్తే అప్పుడు ఒప్పుకుంటానన్నారు చంద్రబాబు. 

రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన:
అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్ చేయడంపై రైతులు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే చేరుకున్న పోలీసులు గ్రామస్తులను ఒప్పించి, ట్యాంకర్‌తో నీళ్లు తెప్పించి మంటలను ఆర్పేశారు. అయితే, న్యాయం అడిగేందుకు రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్తున్న వారిని అడ్డుకోవడమేంటని తుళ్లూరు గ్రామస్తులు ప్రశ్నించారు. 

బస్సు యాత్రకు బ్రేక్:
అమరావతి జేఏసీ నేతలు చేపట్టాలనుకున్న బస్సు యాత్ర రసాభాసగా మారింది. బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు సహా నేతలంతా బెంజి సర్కిల్‌లో రోడ్డుపైనే ధర్నా చేశారు. చివరికి చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు… రాత్రికి ఆయన ఇంటి దగ్గరే విడిచిపెట్టారు. అయితే, ఈ గ్యాప్‌లో పెద్ద డ్రామానే నడిచింది.

ప్రజలు తిరగబడితే ఏమీ చెయ్యలేరు:
విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి ఆఫీస్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదిక కల్యాణ మండపం దగ్గర ఆఫీస్‌ ప్రారంభోత్సవం తరువాత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జేఏసీ నేతలు బస్సు యాత్ర ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరన్నారు. పోలీసులు ముందుకు కదలనివ్వకపోవడంతో చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా బెంజి సర్కిల్‌ దగ్గర రోడ్డుపైనే కూర్చున్నారు.

ఏ చట్టం ప్రకారం అడ్డుకున్నారు:
అమరావతి పరిరక్షణ సమితి నేతల బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను.. ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. అయితే, పోలీసులు మాత్రం బస్సుయాత్రకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఆందోళన తీవ్రతరం కావడంతో చంద్రబాబు సహా జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయడంతో సమీప ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సీఎం జగన్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనలతో బెంజి సర్కిల్‌ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.   

చంద్రబాబు అరెస్ట్:
చంద్రబాబు సహా టీడీపీ, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబులను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఇంతలో వాహన తాళం మాయమైంది. చాలాసేపు వాహనం అక్కడే నిలిచిపోవడంతో.. ర్యాలీలో పాల్గొన్న నేతలంతా అలసిపోయారు. చంద్రబాబు ఐతే.. చిన్నపాటి కునుకు కూడా తీశారు. ఐతే.. ఎట్టకేలకు వాహనం స్టార్ట్‌ కావడంతో.. చంద్రబాబును అక్కడి నుంచి తరలించారు పోలీసులు. చివరికి వారిని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర విడిచిపెట్టారు. అప్పటికే టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు.

Also Read : బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు : అమ్మ ఒడి ప్రారంభించనున్న జగన్