పెళ్లి కావడం లేదని, శ్రీకాళహస్తి ఆలయంలో ప్రైవేట్ విగ్రహాల కేసులో వీడిన మిస్టరీ

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 11:47 AM IST
పెళ్లి కావడం లేదని, శ్రీకాళహస్తి ఆలయంలో ప్రైవేట్ విగ్రహాల కేసులో వీడిన మిస్టరీ

శ్రీకాళహస్తి ఆలయ విగ్రహాల ప్రతిష్ట ఘటన కేసులో మిస్టరీ వీడింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కేసుకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు పోలీసులు. ముగ్గురు అన్నదమ్ముళ్లు ఆ పని చేసినట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. మరి ఆ ముగ్గురు అన్నదమ్ముళ్లు ఎందుకు అలా చేశారు..? వారి అవసరం కోసం అలా చేశారా..? లేదంటే ఎవరైన చెబితే అలా చేశారా..? పోలీసుల విచారణలో తేలిందేంటి..? ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు..?




శ్రీకాళహస్తి ఆలయంలో ప్రైవేట్‌ విగ్రహాల కలకలం:
శ్రీకాళహస్తి ఆలయంలో ప్రైవేట్‌ విగ్రహాల ప్రత్యక్షం.. ఆలయంలో ప్రత్యక్షమైన శివలింగం, నందీశ్వరుడు.. ఈ విగ్రహాల ప్రతిష్టన ఒక్కసారిగా కలకలం రేపింది.. ఓ వైపు ఆలయ అధికారులపై సస్పెన్షన్‌ వేటు..మరోవైపు భగ్గుమన్న రాజకీయపక్షాలు.. రోజురోజుకు వ్యవహారం ముదిరిపోయింది.. ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అందరి మదిలో ఇవే ప్రశ్నలు.. విగ్రహాల ప్రతిష్ట ఘటన రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. సెప్టెంబర్‌ 6వ తేదీ నాటి ఓ సీసీ ఫుటేజీ పోలీసులకు కాస్త ఊరటనిచ్చింది..

ఓ గోనె సంచి భుజాన పెట్టుకుని ఓ వ్యక్తి.. ఆ వెనకాలే మరో ఇద్దరు వ్యక్తులు.. ఆ ముగ్గురే ఆ పని చేశారా..? లేదా దర్శనం కోసం వచ్చారా..? ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు…చివరకు ఆ ముగ్గురే విగ్రహాలను ప్రతిష్టించినట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని అసలు విషయాన్ని రాబట్టారు.




భగ్గుమన్న హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు:
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ప్రైవేట్‌ విగ్రహాల ప్రత్యక్షం తీవ్ర కలకలం రేపింది. ముక్కంటి ఆలయంలోని గర్భాలయానికి దగ్గరలో కాశీలింగం, రామేశ్వరలింగం సమీపంలో కొత్తగా మరో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలు ప్రత్యక్షం కావడం వివాదాస్పదమైంది. ఈ రెండింటిని ఎవరు ప్రతిష్టించారనే అంశంపై నానా రభస చోటు చేసుకుంది. రాష్ట్రంలోని హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్న తరుణంలో ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై ఈవో సస్పెన్షన్‌ వేటు పడింది.

సీసీ కెమెరా ఫుటేజీలో ముగ్గురు అనుమానితులు:
ఇలా ఈ వ్యవహారం ముదరడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విగ్రహాలు ప్రత్యక్షమైన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు లేనప్పటికీ, ఆలయంలోకి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ ఫుటేజీల్లో భక్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. సెప్టెంబర్ 6న ఉదయం ఓ వ్యక్తి మాస్క్‌ ధరించి ఓ పెద్ద గోనె సంచి భుజంపై మోసుకుంటూ..అతడి వెనకాలే మరో ఇద్దరు వ్యక్తులు..ఆలయంలోకి అనుమానాస్పదంగా రావడాన్ని గుర్తించారు.




ఆ ముగ్గురే శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలను ఆలయంలోకి తీసుకొచ్చినట్లు అనుమానించారు. అయితే మాస్కు ధరించి ఉండటం వల్ల ఆ వ్యక్తి ఆనవాళ్ళు గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. కొందరు ఆలయ సిబ్బంది సహకారంతోనే ఆ గోనె సంచిని దర్జాగా ఆలయంలోకి తీసుకొచ్చారని అనుమానించారు. ఆలయ పరిసరాల్లోని మరిన్ని ఫుటేజ్‌ల ద్వారా ఆ వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు…చివరకు ఆ ముగ్గురే నిందితులని తేల్చారు.

వివాహం కాకపోవడంతో విగ్రహాల ప్రతిష్ట:
పుత్తూరుకి చెందిన పిండి సులవర్ధన్(32), పిండి తిరుమలయ్య(30), పిండి ముని శేఖర్(28) అనే ముగ్గురు సోదరులు..త‌మ‌కు వివాహం కాకపోవటంతో ఆలయంలో శివ లింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించినట్లు పోలీసుల విచార‌ణ‌లో తెలిపారు. దోషం పోవాలంటే పూజలు చేయాలని ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతోనే ఇలా చేసినట్లు తెలిపారు.




తిరుపతిలో సెప్టెంబర్ 2న విగ్రహాలు చేయించి, 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. సీసీ విజువల్స్, బైక్‌ల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శివలింగం తయారీకి రూ.4వేలు, నంది విగ్రహం తయారీకి రూ.3వేలు చెల్లించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసుకు…చివరకు ఇలా ఫుల్‌స్టాప్‌ పడింది. మూఢనమ్మకంతో విగ్రహాలు ప్రతిష్టించిన అన్నదమ్ముళ్లు జైలు పాలయ్యారు.