సంక్రాంతి వస్తోంది : కోడి కత్తులపై ఫోకస్, పందాలపై పోలీసుల ఉక్కుపాదం

సంక్రాంతి వస్తోంది : కోడి కత్తులపై ఫోకస్, పందాలపై పోలీసుల ఉక్కుపాదం

Pandalu

Sankranthi Kodi Pandalu : సంక్రాంతి వస్తోంది.. ఏపీలో పందెం రాయుళ్లు రెడీ అయిపోయారు. హైకోర్టు హెచ్చరించినా పట్టింపు చేయడం లేదు.. దీంతో కృష్ణా జిల్లాలో కోడిపందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ బరులు ధ్వంసం చేసి.. పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఏపీలో సంక్రాంతికి కోడిపందేలు ఖచ్చితంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కోర్టు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ.. పోలీసులు స్టిక్ట్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బరులు సిద్ధమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు.

కోడిపందాల్లో కీలకభూమిక పోషించేది మాత్రం కత్తులే కావటంతో కృష్ణాజిల్లా పోలీసులు కోడి కత్తులపై ఫోకస్ పెట్టారు. కోడి కత్తులు కొనేవారు, వాటిని తయారు చేసే వారిని గుర్తించి పట్టుకుంటే పందెం రాయుళ్ళను కూడా పట్టుకోవడం తేలికని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ లో భారీగా కోడి కత్తులు పట్టుబడుతున్నాయి. ముందస్తుగా పలువురిని బైండోవర్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగను అందరూ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని జూద క్రీడలకు దూరంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు కోడిపందాలు సంప్రదాయంగా వస్తున్నాయని.. సంవత్సరంలో ఒక్కసారి జరిగే పందాలను అడ్డుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు.. కోడిపందాలు జరగకుండా పోలీసులు పకడ్బంధీ చర్యలు చేపట్టారు.