చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నపోలీసులు…ఒక వాహనానికే అనుమతి

చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నపోలీసులు…ఒక వాహనానికే అనుమతి

Police intercepted Chandrababu’s convoy : విజయనగరం జిల్లాలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. రామతీర్థం కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టడంతో.. ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పోటాపోటీగా రామతీర్థం బాట పట్టడంతో.. రాజకీయ రగడ రాజుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే రామతీర్థం ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయానికి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను విజయనగరం శివార్లలో పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లో ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కేవలం ఆయన వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు. మిగతా వాహనాలు రాకుండా లారీలను అడ్డుపెట్టారు. తన వాహనానికి మాత్రమే అనుమతిచ్చి మిగతా వాహనాలను లారీలతో అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. మిగతా వాహనాలను కూడా అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలిచే రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐదు రోజుల క్రితం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో శ్రీరామచంద్రుని విగ్రహానికి అమానుషం జరిగింది. బోడికొండపై శ్రీసీతారామ లక్ష్మణ విగ్రహాలు కొలువై ఉంటాయి. వాటిలో రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేశారు. విగ్రహం తలభాగాన్ని పూర్తిగా తొలగించివేసి కోనేరులో పడేశారు. ఈ నెల 29న ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఉదయంపూట ఎప్పటిలానే కొండపైకి వెళ్లి ఆలయం తలుపులు తీసిన పూజారి…శిరస్సులేని రాముడి విగ్రహం చూసి హతాశుడయ్యారు. వెంటనే విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి విస్తృతంగా గాలించగా…కోనేరులో విగ్రహం తల లభించింది.

స్థానిక పోలీసులతో పాటు ఎస్పీ..గర్భాలయంలోకి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి దర్యాప్తు జరిపారు. ఇటీవల కాలంలో కొండపై విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశారు. అయితే సీసీటీవీ లేకపోవడంతో…ఈ దారుణానికి పాల్పడింది ఎవరన్నదానిపై ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విగ్రహం ధ్వంసం గురించి తెలుసుకున్న స్థానిక భక్తులు..కొండపైకి భారీగా చేరుకుని ఆందోళన జరిపారు.

విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐదురోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఒకేసారి రామతీర్థంకు వస్తుండడం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు రోడ్డుమార్గంలో రామతీర్థం రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భారీగా పోలీసులను మోహరించారు.