మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఎందుకు జరిగింది? సూత్రధారులెవరు ? పాత్రధారులెవరు?

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 07:34 AM IST
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఎందుకు జరిగింది? సూత్రధారులెవరు ? పాత్రధారులెవరు?

Perni Nani attempted murder case : ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు ప్రచారం సాగుతుండగా.. తనకు, హత్యాయత్నానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి నానిపై హత్యాయత్నం ఎందుకు జరిగింది? సూత్రధారులెవరు..? పాత్రధారులెవరు?



మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బడగు నాగేశ్వరరావు అనే తాపీ మేస్త్రీ మంత్రిపై దాడి చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. కోర్టు అనుమతితో మచిలీపట్నం సబ్‌జైలు నుంచి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్నారు.



ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రిపై దాడి జరిగిన తర్వాత … భవన నిర్మాణ కార్మికుడు అక్కసుతోనే దాడి చేసి ఉంటాడని మీడియాతో కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. దీంతో ఏ ఆధారంతో ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చారో చెప్పాలని ఆయనకు నోటీసులిచ్చారు. అయితే మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో.. ఇప్పటికే స్థానిక టీడీపీ నేతలను విచారించారు పోలీసులు.



అయితే మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని కొల్లు రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఎవరో చేసిన దాడిని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని చెప్పారు. దాడి ఎందుకు జరిగింది, దాడి వెనుక ఎవరి హస్తం ఉందో పోలీసులు నిస్పక్షిపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు నిజాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును మరింత స్పీడ్ పెంచారు. మంత్రిపై జరిగిన దాడి మిస్టరీని నిగ్గు తేల్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.