సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసు…మరో ఇద్దరు నిందితులను కస్టడీకి అనుమతించిన కోర్టు

  • Published By: bheemraj ,Published On : August 8, 2020 / 04:34 PM IST
సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసు…మరో ఇద్దరు నిందితులను కస్టడీకి అనుమతించిన కోర్టు

విశాఖలో సంచలనం రేపిన సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన ఏ5 డాక్టర్ తిరుమల, ఏ4 రామకృష్ణ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏ1 డాక్టర్ నమ్రత కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్ వేయడంతో మరో మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది.



దీంతో మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో ఏ1 డాక్టర్ నమ్రతతోపాటు ఏ5 డాక్టర్ తిరుమలను పోలీసులు విచారించారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతను రెండు రోజులు విచారించిన పోలీసులు.. ఏ1 ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ కేసులో మరో ఇద్దరిని కస్టడీకి కోరారు. 63 ప్రసవాలలో అసలు తల్లిదండ్రులు, చిన్నారులు ఎక్కడున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు ఏ4 ఏజెంట్ రామకృష్ణను పోలీసులు విచారించనున్నారు.

సృష్టి యూనివర్సల్ ఆస్పత్రిపై బాధితుల ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి. విశాఖలో ఇప్పటివకే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అటు తెలంగాణలో సృష్టి అక్రమాలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నమ్రత అక్రమాలు బయటపడుతుండటంతో బాధితులంతా ఒక్కొక్కరిగా ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.



మరోవైపు సృష్టి ఆస్పత్రిలో డెలివరీ అయిన మహిళలు తాము తీసుకున్న శిశువులు తమకు పుట్టిన వారేనా కాదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం డీఎన్ఏ టెస్టులు చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు. చిన్నారుల అక్రమ రవాణా కేసును సుమోటోగా స్వీకరించాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది.

వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనం సృష్టిస్తుండటంతో మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణ చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నమ్రత వైద్య డిగ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది.



సృష్టి ఆస్పత్రిలో పసిపిల్లల అక్రమ రవాణాలో వ్యవహారంలో రామకృష్ణ, డాక్టర్ తిరుమల చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా రామకృష్ణ…ఆశా వర్కర్లు, రూలర్లతోపాటు నెట్ వర్క్ ఏర్పాటు చేశారు. ఏరియాలో ఎవరైనా గర్భం దాల్చినా, ఎవరైన పేదవారు ఉంటే తమకు తెలియజేయాలని ఆశా వర్కర్లకు డబ్బు ఆశ చూపి వారందరితో సమాచారం సేకరించేవాడు.

అంతేకాకుండా రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లతో సైతం రామకృష్ణ పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఒక వింగ్ ను ఏర్పాటు చేశారు. నమ్రత..రామకృష్ణ చేత ఈ వింగ్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.