ప్రత్యేక మంటలు : మధు, రామకృష్ణలపై విరిగిన లాఠీలు

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 10:14 AM IST
ప్రత్యేక మంటలు : మధు, రామకృష్ణలపై విరిగిన లాఠీలు

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ సెగలు రేపింది. స్పెషల్ స్టేటస్ కోసం జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు పార్లమెంటు ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ నేత రామకృష్ణలకు గాయాలయ్యాయి. ప్రత్యేక హోధా సాధన సమితి కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు గాయపడ్డారు. బ్యారికేడ్లు తోసుకుని పార్లమెంటు వైపుకి వచ్చే ప్రయత్నం చేయడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో లాఠీఛార్జ్ చేశారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు టీజీ వెంకటేష్, రవీంద్ర కుమార్ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.