బెజవాడ గ్యాంగ్ వార్‌‌లో పాల్గొన్న వారిపై నగర బహిష్కరణ వేటు, పీడీ యాక్ట్.. పండు తల్లిపై రౌడీ షీట్

ఏపీలో సంచలనం రేపిన బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గ్యాంగ్ వార్ లో పాల్గొన్న వారిపై కఠిన

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 06:51 AM IST
బెజవాడ గ్యాంగ్ వార్‌‌లో పాల్గొన్న వారిపై నగర బహిష్కరణ వేటు, పీడీ యాక్ట్.. పండు తల్లిపై రౌడీ షీట్

ఏపీలో సంచలనం రేపిన బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గ్యాంగ్ వార్ లో పాల్గొన్న వారిపై కఠిన

ఏపీలో సంచలనం రేపిన బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గ్యాంగ్ వార్ లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలకు సిద్దమయ్యారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు రౌడీ మూకలు యువకులతో కలిసి అలజడి రేపడాన్ని క్షమించరాని నేరంగా పోలీసులు భావించారు. గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరు యువకులపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్‌ను ఉపయోగించబోతున్నారు. గ్యాంగ్‌వార్‌కు కారకులైన మాజీ రౌడీషీటర్‌ సందీప్, మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు గ్రూపులకు చెందిన సభ్యులందరిపైనా పీడీ యాక్ట్‌ పెట్టనున్నారు. ఘర్షణ జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కన్నబిడ్డను నేరాలవైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్‌ చేశారు. 

గ్యాంగ్‌వార్‌పై పోలీసుల కఠిన చర్యలు:
* విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 417 మంది రౌడీషీటర్లు
* శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరగాళ్లు 497 మంది
* ఇప్పటికే 7 మందిపై నగర బహిష్కరణ వేటు
* తాజాగా సందీప్, పండుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో మరికొందరిపై నగర బహిష్కరణ వేటు ప్రతిపాదనలు సిద్ధం

నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్ గా పండు తల్లి‌:
మాజీ రౌడీషీటర్‌ సందీప్‌పై మణికంఠ అలియాస్‌ పండును దాడికి ప్రోత్సహించిన కారణంగా అతని తల్లి కోడూరి పద్మావతిని సందీప్‌ హత్యా నేరం కేసులో నాలుగో ముద్దాయిగా చేరుస్తూ పటమట పోలీసులు కేసు నమోదు చేసి.. రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. గతంలో పద్మావతిపై పెనమలూరు పరిధిలో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పటమట 307 ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదైంది. మొత్తం మూడు కేసులు నమోదు కావడంతో ఈమెపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయనున్నారు. దీంతో పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోనే కాకుండా నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్‌గా ఈమె పోలీసు రికార్డుల్లోకెక్కనుంది. అలాగే పీడీ యాక్ట్‌ కూడా పద్మావతిపై పోలీసులు పెట్టనున్నారు. దీంతోపాటు పద్మావతి గత చరిత్ర, ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆమెకు నేరప్రవృత్తి ఉన్నట్లు రుజువైతే నగర బహిష్కరణ వేటు వేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న వేట:
ఇక ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 10 మంది నిందితులతోపాటు సెటిల్‌మెంట్ల వ్యవహారంలో తలదూర్చిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్నవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. 

సందీప్‌ గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌:
మాజీ రౌడీషీటర్‌ తోట సందీప్‌ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 11 రోజుల కిందట విజయవాడలోని పటమట తోటవారివీధిని మైదానంలో రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడి చేసుకున్నాయి. ఈ గ్యాంగ్‌వార్‌లో తీవ్రంగా గాయపడ్డ తోట సందీప్‌ మృతి చెందగా.. మరో గ్రూపునకు లీడర్‌గా ఉన్న కోడూరి మణికంఠ అలియాస్‌ పండు గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పండు వర్గంపై దాడికి పాల్పడ్డ తోట సందీప్‌ వర్గానికి చెందిన 11 మందిని పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

* గ్యాంగ్‌వార్‌లో సందీప్‌ తరఫు పాల్గొన్న 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
* నిందితుల్లో సందీప్‌ సోదరుడు తోట జగదీష్‌ అలియాస్‌ బాలు, మంగళగిరికి చెందిన మేకతోటి కిరణ్‌కుమార్, ఆకురాతి వెంకట శివరఘునాథ్, పంది విజయప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో కిరణ్, రఘునాథ్‌లపై మంగళగిరి పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. 
* వీరితోపాటు యర్రంశెట్టి రాము, చింతా సాంబశివరావు, చందా రామ్‌ నితిన్, జక్కా రత్నసాయిలు, పెనమలూరుకు చెందిన కందెల శివరామకృష్ణ, యనమలకుదురుకు చెందిన బోడా శివ, తాడిగడపకు చెందిన కన్నా సునీల్‌లు ఉన్నారన్నారు. వీరిలో చాలా మంది సందీప్‌కు చిన్ననాటి స్నేహితులు కావడం, ఒకే స్కూల్‌లో చదువుకోవడం వల్ల ఆ పరిచయంతో పిలవగానే వీరంతా సందీప్‌ వెంట వచ్చారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నవారందరిపైనా వేట కొనసాగుతోందన్నారు.

Read: ఆన్ లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థిని ఆత్మహత్య