ఏడేళ్లనాటి పగ – ఫేస్ బుక్ లో నకిలీ ఐడీ సృష్టించి హత్య

ఏడేళ్లనాటి పగ – ఫేస్ బుక్ లో నకిలీ ఐడీ సృష్టించి హత్య

police solved murder case in guntur distirict : ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. వరుడిపై పగ పెంచుకున్న అమ్మాయి బంధువులు ఏడేళ్ల తర్వాత పధకం ప్రకారం వారింటికి రప్పించి అతడ్ని హత్యచేసిన ఘటన గుంటూరుజిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన కంచర్ల నాగరాజు ఈ ఏడాది జనవరి 20వ తేదీన నర్సరావుపేటలో పని ఉందని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య రమాదేవి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా నాగరాజు హత్యకాబడినట్లు గుర్తించారు. కేసు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు.

నాగరాజు చదువుకునే రోజుల్లో నర్సరావుపేట మండలం తురకపాలెం గ్రామానికి చెందిన షేక్‌ అసియా అనే యువతిని 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుంటూరులో కాపురం పెట్టిన కొద్ది రోజులకే అసియా ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును 2017లో జిల్లా కోర్టు కొట్టివేసింది. ఇది జీర్ణించుకోలేని అసియా కుటుంబ సభ్యులు నాగరాజును ఎలాగైనా హతమార్చాలని పన్నాగం పన్నారు. రెండుసార్లు అతనిపై హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. ఎలాగైనా సరే నాగరాజును హత్య చేయాలనే కసి వారిలో పెరగసాగింది.

ఈసారి కొత్త ప్లాన్ వేశారు. అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ప్రోఫైల్ క్రియేట్ చేసారు. నాగరాజు కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతడ్ని వలలోకి లాగారు. అతనితో అమ్మాయిలాగా చాటింగ్ చేయటం ప్రారంభించారు. తాను చిలకలూరిపేటలో ఉంటానని తన వద్దకు రావాలని ఆహ్వానించారు. నిజమని నమ్మిన నాగరాజు చిలకలూరిపేటలోని సుభానినగర్ లో ఉండే అబ్దుల్ సలీం ఇంటికి వెళ్లాడు.

నాగరాజు ఇంట్లోకి రాగానే తలుపులు మూసేసి, నోట్లో గుడ్డలు కుక్కి చితక బాదారు. కసితీరా కొట్టాక నాగరాజు మెడకు తాడువేసి బిగించి హత్య చేశారు. అనంతరం నాగరాజు మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి కారులో నరసరావు పేట శివారులోని పెదతురకపాలెంలో ముద్దాయిలకు చెందిన మట్టిక్వారీలో పడేసి దహనం చేశారు.

నాగరాజు భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజు మొదటి వివాహాం గురించి తెలుసుకున్నారు. అసియా ఆత్మహత్య చేసుకోవటం… నాగరాజుపై హత్యాయత్నాలు జరగటం తెలుసుకుని ఆదిశగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

ఈ కేసులో నిందితులైన షేక్‌ అబ్దుల్‌సలీం, నబీజానీ, మీరాజిలానీ, పఠాన్‌ అక్బర్‌ వలి, సయ్యద్‌ అబ్బాస్, సయ్యద్‌ పీరువలి, తుబాటి సలీంలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు గురజాల డీఎస్పీ జయరామ్‌ప్రసాద్‌ తెలిపారు.