స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన, ఆ ఇద్దరి ఆచూకీ చెబితే లక్ష బహుమతి

  • Published By: naveen ,Published On : August 21, 2020 / 01:13 PM IST
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన, ఆ ఇద్దరి ఆచూకీ చెబితే లక్ష బహుమతి

ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఇవాళ(ఆగస్టు 21,2020) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. 8వ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కేసుని విచారించనుంది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రమేష్ ఆసుపత్రి ముగ్గురు సిబ్బంది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జడ్జి వాదనలు వింటారు. కాగా, రమేష్ హాస్పిటల్స్ ఎండీ రమేశ్ బాబు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసులు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. అలాగే హోటల్ స్వర్ణ ప్యాలెస్ అధిపతి శ్రీనివాసరావు కూడా పరారీలో ఉన్నారు. ఆయన కోసం కూడా పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రమేశ్ బాబు, శ్రీనివాసరావు ఆచూకీ చెబితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని విజయవాడ సీపీ శ్రీనివాసులు ప్రకటించారు.



అగ్నిప్రమాదంలో 10మంది కరోనా పేషెంట్లు మృతి:
స్వర్ణ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన రమేష్ ఆసుపత్రి కరోనా కేర్ సెంటర్ లో ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10మంది కరోనా బాధితులు చనిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అయితే.. విచారణకు ముద్దాయిలు, అనుమానితులు ఎవరూ సహకరించడం లేదని విజయవాడ సీపీ శ్రీనివాసులు అన్నారు. ఆస్పత్రి బోర్డు సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చామని.. ఇప్పటికే డాక్టర్ మమతకు నోటీసులివ్వడంతో పాటు ప్రశ్నించామన్నారు. అనంతరం రాయపాటి శైలజకు కూడా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు.



ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాస్‌ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణను కూడా స్పీడప్ చేశారు.

పోలీసులకు పార్టీలు, మతాలు ఉండవు:
రమేష్ ఆస్పత్రి విచారణలో హీరో రామ్ ట్వీట్‌పై సీపీ ఘాటుగా రియాక్ట్ స్పందించారు. విచారణ ఎలా చేయాలో తమకు తెలుసని.. పోలీసులకు రాజకీయ పార్టీలు, మతాలు ఉండవన్నారు. ఈ కేసుకు సంబంధించి చెన్నె, బెంగళూరు, హైదరాబాద్‌కి స్పెషల్ టీమ్‌లను పంపామని.. ఆస్పత్రి, హోటల్ మధ్య ఎంవోయూ ఉందని తొలుత చెప్పారని.. ఇప్పటివరకు ఆ ఎంవోయూ పోలీసులకు ఇవ్వలేదన్నారు. ఆస్పత్రి యాజమాన్యం తమకు సహకరించాలన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.



ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారని సీపీ అన్నారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు లేకుండా కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించామని చెప్పిన సీపీ.. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ సందేహం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసి విచారిస్తామని, ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

అగ్నిప్రమాదంలో చనిపోయిన 10మందిలో 8మందికి కరోనా నెగిటివ్:
స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యాల మధ్య ఎటువంటి ఒప్పందం జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల నుండి చికిత్స కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తమ విచారణలో తేలిందని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో అన్యాయంగా పది మంది చనిపోయారని.. అందులోనూ వారిలో ఎనిమిది మందికి కరోనా నెగిటివ్ అని తేలిందని సీపీ చెప్పారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు.