Amaravati: అమరావతిపై విచారణ వాయిదా.. రాజధాని తరలింపుకు ఆటంకం

ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

Amaravati: అమరావతిపై విచారణ వాయిదా.. రాజధాని తరలింపుకు ఆటంకం

Amaravati

Amaravati: ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. కరోనా కేసులతో విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు, వారి తరుపు లాయర్లు కోరడంతో న్యాయస్థానం విచారణను నవంబర్‌ 15కి వాయిదా వేసింది. మరోవైపు ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

సీజే అరూప్‌కుమార్ గోస్వామితో పాటు జస్టిస్ బాగ్చి, జస్టిస్ జయసూర్యతో కూడిన బెంచ్.. మొత్తం 57 పిటిషన్లపై విచారణ జరిపింది. దేశంలో పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని కోరగా.. ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు వాయిదా నిర్ణయాన్ని కోర్టుకే వదిలేశారు. దేశంలో, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుని సీజే ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

ఈ ఏడాది మార్చి 26న ఏపీ రాజధాని పిటిషన్లపై మొదటిసారి విచారణ జరిగింది. ఆ సమయంలో తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. ఆ తర్వాత కోవిడ్ కారణంగా లాయర్ల అభ్యర్థనతో ఆగస్టు 23కు వాయిదా పడింది. తాజాగా ఈ వ్యాజ్యాలపై విచారణ జరగ్గా మరోసారి వాయిదా పడింది. విచారణ వాయిదా పడడంతో అది పూర్తయ్యేవరకూ రాజధానుల తరలింపు ముందుకు సాగేలా కనిపించడం లేదు.

ఏపీ రాజధాని కేసులో రోజువారి విచారణ జరుగుతుందని హైకోర్టు చెప్పిందని, మరి విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాయిదా వేయాలని కోరడం వెనక ఏమైనా దురుద్దేశం ఉందా? అనేది అర్థం కావడం లేదన్నారు బొత్స. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి మరోసారి స్పష్టం చేశారు. న్యాయస్థానాన్ని ఒప్పించి, కోర్టు ఆదేశాలతోనే ముందుకెళ్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.