ఏపీలో ఇప్పుడు అధికారంలోకి రాలేం….2024 లోనే సాధ్యం – రాం మాధవ్

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 02:25 PM IST
ఏపీలో ఇప్పుడు అధికారంలోకి రాలేం….2024 లోనే సాధ్యం – రాం మాధవ్

ఏపీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని..కానీ 2024లో సాధ్యమౌతుందని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అంత సులభం కాదని, రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని, ఈ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలన్నారు.



బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా…రాం మాధవ్ మాట్లాడుతూ…

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలని పిలుపునిచ్చారు. సోము వీర్రాజు మరింత పటిష్టంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పటిష్టనాయకత్వంతో బీజేపీ ముందుకెళుతుందని, రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలనేదే లక్ష్యమన్నారు.



సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేడర్ కు సూచించారాయన. ఏపీలో పార్టీ బలోపేతానికి పక్కా ప్రణాళికలు రచించాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ బలమైన పోరాటం చేయాలన్నారు. పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలో తేల్చుకోలేని స్థితిలో దేశంలో పార్టీలున్నాయని ప్రతపక్షాలనుద్దేశించి ఎద్దేవా చేశారు.

కన్నాను అధ్యక్షుడిగా తీసి సోము వీర్రాజును పెట్టలేదని, ఇది బాధ్యతగల అప్పగింత మాత్రమేనని, కన్నాకు మరో బాధ్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు.



ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం నియమించింది. పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు.

రాజకీయాలు పక్కన పెట్టేసి సినిమాలు చేసుకుంటున్న చిరంజీవిని, జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ తో సోము భేటీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తాయని సోము ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి రాం మాధవ్ అనుకుంటున్నట్లు 2024 లో అధికారంలోకి వస్తుందా ? లేదా ? అనేది చూడాలి.