President Draupadi Murmu : నేడు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆమె పర్యటించనున్నారు. మొదటగా రాష్ట్రపతి ముర్ము శ్రీశైలంకు రానున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వెళ్లనున్నారు.

PRESIDENT MURMU
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆమె పర్యటించనున్నారు. మొదటగా రాష్ట్రపతి ముర్ము శ్రీశైలంకు రానున్నారు. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె శ్రీశైలం మల్లన్న ఆలయానికి వెళ్లనున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నంద్యాల జిల్లా కలెక్టర్ తెలిపారు.
నిన్న జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.నిషాంత్ లతో కలిసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సున్నిపెంట హెలిప్యాడ్ దగ్గర మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. దీన్ని ఆయన పరిశీలించారు. హెలిప్యాడ్ లోని గ్రీన్ రూమ్, సేఫ్ రూమ్, విజిటర్స్ రూమ్ ను పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటనలో విధులు నిర్వహించే సిబ్బంది, ప్రతి ఒక్కరు డ్యూటీ పాస్ ధరించాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ తమ డ్యూటీ దగ్గర అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో చెంచు విద్యార్థుల సుస్వాగతం నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీందర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, జ్ఞాన మందిరాన్ని సుందరీకరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వెళ్లనున్నారు. ఐదు రోజుల పర్యటన కోసం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాత్రి 7.45 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై విందు ఇస్తున్నారు. ఈ విందుకు రాష్ట్రపతి ముర్ము హాజరుకానున్నారు.
రేపు హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థలు, విద్యార్థులతో సమావేశం కానున్నారు. 28న భద్రాచలం, రామప్ప ఆలయాలను ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. ఆలయాల విశిష్టతలను అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఈనెల 29న ద్రౌపది ముర్ము షేక్ పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీని సందర్శిస్తారు.
కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులతోనూ సమావేశం అవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం శంషాబాద్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. ఈనెల 30న రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీరామ చంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆమె ఢిల్లీకి పయనమవుతారు.