విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..రాజకీయ పార్టీల ఉద్యమబాట

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..రాజకీయ పార్టీల ఉద్యమబాట

Visakhapatnam Steel Plant Privatization : విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది నేతలను కాచుకుని ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటుపరమవుతుందనే వార్తలతో ఏపీలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉనికి కాపాడుకోవాలంటే స్టీల్‌ ప్లాంట్‌పై పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నేతలది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా.. నాన్‌ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానిలో కార్మిక సంఘాలు జాయిన్ అవ్వడంతో వైసీపీ నేతలు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజీనామాలతో లాభం లేదని మంత్రి అవంతి అంటున్నారు. ప్రైవేటీకరణపై వైఖరేంటో చెప్పాలని కార్మికులు ఎంపీ విజయసాయి రెడ్డిని నిలదీశారు.

కార్మికులను బుజ్జగించేందుకు ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు విజయసాయి రెడ్డి. ఆ సమావేశంలో రాజకీయ పార్టీలకు దీటుగా తామే పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని, రాజకీయ పార్టీలు గైడెన్స్‌ ఇవ్వాలని కోరారు ప్రతినిధులు. పోరాటంలో అన్ని పక్షాలు పాల్లొనాలని తెలిపారు. అందుకోసం కార్యాచరణను కూడా ప్రకటించింది కార్మిక సంఘాల జేఏసీ.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి పోరాడాతమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇవాళ అన్ని పార్టీ ఎంపీలందరూ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామన్నారు. అలాగే.. ప్రధాని మంత్రి అపాయింట్‌మెంట్‌ ఇస్తే కార్మిక నేతలను కూడా తీసుకువెళ్తాన్నారు.