మూడు రాజధానులపై త్వరలో ఆర్డినెన్స్.. ఉభయ సభల ప్రోరోగ్

  • Published By: sreehari ,Published On : February 13, 2020 / 12:03 PM IST
మూడు రాజధానులపై త్వరలో ఆర్డినెన్స్.. ఉభయ సభల ప్రోరోగ్

ఏపీ శాసన సభ, మండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చేయోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీ విషయంలో పీటముడిపడింది.

ఇప్పటికిప్పుడు మండలి రద్దుకాదు. తనకున్న బలంతో  ఎలాగైన సెలక్ట్ కమిటీని ఏర్పాటుచేసి జనంలోకి వెళ్లి ప్రభుత్వ పరువుతీయాలని టీడీపీ అనుకొంటోంది. ఈ పరిణామం సహజంగానే ప్రభుత్వానికి నచ్చదు. అందుకే సెలక్ట్ కమిటీతో సంబంధంలేకుండా ఆర్డినెన్స్ ను జారీ చేసి, పని మొదలుపెట్టాలనుకొంటోంది. అందుకే సెలక్ట్ కమిటీ ఏర్పాటును జాప్యం చేసింది. 

ఒకసారి సెలక్ట్ కమిటీకి బిల్లును ఛైర్మన్ పంపించిన తర్వాత అదే బిల్లుపై ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని అంటున్నారు యనమల. ప్రభుత్వం సెలక్ట్ కమిటీ ఏర్పాటుచేసినా, లేకున్నా రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ ఇవ్వలేరని టీడీపీ కూడా అంటోంది. 

సెలక్ట్ కమిటీ రూల్ తో ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇస్తే.. మండలి రద్దుతీర్మానం చేసి, ఇప్పుడు ప్రొరోగ్ ద్వారా ఏకంగా  వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీయే సవరణ బిల్లులపై ఆర్డినెన్స్ కు సిద్ధమవుతోంది జగన్ ప్రభుత్వం. మోడీని కలిసిన తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్స్ రూట్ ను ఎంచుకొందంటే కేంద్రానికి చెప్పి చేస్తున్నట్లేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.