పీఎస్‌ఎల్‌వీ-సీ51 తొలి కమర్షియల్ ప్రయోగం సక్సెస్

పీఎస్‌ఎల్‌వీ-సీ51 తొలి కమర్షియల్ ప్రయోగం సక్సెస్

PSLV-C51 launch success : అంతరిక్షంలో ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది. సైన్స్ డే రోజున ఇస్రో ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. పీఎస్‌ఎల్‌వీ సీ 51 నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది. కరోనా అనంతర పరిస్థితుల్లో ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. పీఎస్‌ఎల్‌వీ నుంచి శాటిలైట్ విజయవంతంగా విడిపోయింది. 637 కిలోలు ఉన్న బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా-1 ఉపగ్రహం సహా…18 చిన్న ఉపగ్రహాలను మోసుకుని విజయవంతంగా అంతరిక్షంలో దూసుకుపోతోంది.

అమెరికాకు చెందిన స్పేస్‌బీస్‌ ఉపగ్రహాలు 12, ఎస్‌ఏఐ-1, నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారు చేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ధావన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి ఇస్రో పంపింది. ఈ సిరీస్‌లో ఇది 53వ ప్రయోగం. 1.55 గంటల పాటు ప్రయాణించి..కక్ష్యలోకి చేరనుంది.

ప్రయోగంలోని నాలుగు దశలు విజయవంతంగా పూర్తికాగానే ఇస్రో కార్యాలయంలో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. పూర్తిస్థాయి వాణిజ్యపరంగా చేపట్టిన మొదటి ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయవంతమై… ప్రపంచ వ్యాప్తంగా భారత శాస్త్రవేత్తల సత్తా చాటింది. పీఎస్‌ఎల్‌వీ- సీ51 విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ శివన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.