రొయ్యల కోసం ఏపీలో క్వారంటైన్ సెంటర్… అవాక్కయ్యారా? అసలు విషయం ఏంటంటే..

కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వినే ఉంటారు. అందులో ఎలాంటి వింత లేదు. కానీ, రొయ్యల కోసం క్వారంటైన్‌ కేంద్రం.. గురించి విన్నారా. లేదు కదూ. రొయ్యలకు క్వారంటైన్ కేంద్రం ఏంటి? అని విస్తుపోతున్నారు కదూ. అవును, ఏపీలో రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది.

రొయ్యల కోసం ఏపీలో క్వారంటైన్ సెంటర్… అవాక్కయ్యారా? అసలు విషయం ఏంటంటే..

Quarantine Centre For Shrimps

Quarantine Centre For Shrimps: కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వినే ఉంటారు. అందులో ఎలాంటి వింత లేదు. కానీ, రొయ్యల కోసం క్వారంటైన్‌ కేంద్రం.. గురించి విన్నారా. లేదు కదూ. రొయ్యలకు క్వారంటైన్ కేంద్రం ఏంటి? అని విస్తుపోతున్నారు కదూ. అవును, ఏపీలో రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది.

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట దగ్గర ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ కోసం రంగం సిద్ధమైంది. 2023 నాటికి ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రొయ్యల సాగు చేపట్టాలంటే నాణ్యమైన సీడ్‌ (రొయ్య పిల్ల) చాలా ముఖ్యం. నాణ్యమైన సీడ్‌ కావాలంటే జన్యుపరమైన సమస్యలు, రోగాల్లేని బ్రూడర్స్‌ (తల్లి రొయ్యలు) అవసరం. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎపిడ్యూజిస్‌ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు బ్రూడర్స్‌ ద్వారా వాటి సంతతికి సంక్రమించవని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్‌ అని వస్తేనే బ్రూడర్స్‌ను సీడ్‌ ఉత్పత్తికి అనుమతిస్తారు.

యానిమల్‌ ఇంపోర్ట్‌ యాక్ట్-1898 ప్రకారం విదేశాల నుంచి ఏ రకం లైవ్‌ స్టాక్‌ (జీవాల)ను దిగుమతి చేసుకున్నా.. వాటి ద్వారా వాటి సంతతికి, మానవాళి సహా ఇతర జీవ రాశులకు ఎలాంటి రోగాలు సోకవని నిర్ధారించుకునేందుకు వాటిని క్వారంటైన్‌ చేయాల్సిందే. అదే విధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తల్లి రొయ్యలను కూడా క్వారంటైన్‌లో ఉంచి పరీక్షిస్తారు. ఇలా పరీక్షించేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చెన్నైలో మాత్రమే ఆక్వా క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఉంది.

దీన్ని మెరైన్‌ ప్రోడక్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా), రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ ఆక్వా కల్చరిక్స్‌ (ఆర్‌జీసీఏ) నిర్వహిస్తున్నాయి. ఏపీతో సహా దేశంలోని ఆక్వా హేచరీలన్నీ ఈ కేంద్రానికి క్యూ కట్టాల్సిందే. ఇక్కడ 400 తల్లి రొయ్యలను ఒక క్యారంటైన్‌ క్యూబికల్‌లో ఉంచి ఐదారురోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఒక క్వారంటైన్‌ క్యూబికల్‌కి డిమాండ్‌ను బట్టి రూ.95 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేస్తారు.

రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే హేచరీలు దేశవ్యాప్తంగా మొత్తం 560 ఉంటే.. వాటిలో 389 హేచరీలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఇక్కడ ఏటా 65 వేల మిలియన్ల సీడ్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం ఏటా సింగపూర్, హవాయ్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల నుంచి 1.50 లక్షల బ్రూడర్స్‌ను హేచరీలు దిగుమతి చేసుకుంటాయి. వీటిని క్వారంటైన్‌ చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటారు.

దేశం మొత్తమ్మీద ఒకే ఒక్క క్వారంటైన్‌ కేంద్రం ఉండటంతో సకాలంలో క్వారంటైన్‌ పూర్తి కాక, సీజన్‌కు నాణ్యమైన సీడ్‌ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అదును దాటిపోతుందన్న ఆందోళనతో నాసిరకం సీడ్‌పై ఆధారపడి ఆక్వా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట దగ్గర ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 30 ఎకరాలను సేకరించారు. దీని నిర్మాణానికి రూ.36.55 కోట్లను కేటాయించి ఇటీవలే టెండర్లు ఖరారు చేశారు. దీనిని 2023 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

నాణ్యమైన సీడ్‌ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఇది రెండో క్వారంటైన్‌ కేంద్రం. ఏడాదికి 1,23,750 బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంటుంది. ఒకేసారి 625 తల్లి రొయ్యలను పరీక్షించవచ్చు. వీటి ద్వారా 10 బిలియన్ల సీడ్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్వా సాగు విస్తరణకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుంది.