పెళ్లి, డేటింగ్ పేరుతో రూ.21లక్షల చీటింగ్- పెళ్లికాని ప్రసాద్ లే టార్గెట్

పెళ్లి, డేటింగ్ పేరుతో రూ.21లక్షల చీటింగ్- పెళ్లికాని ప్రసాద్ లే టార్గెట్

rachakonda cyber cops arrested couple for cheated a man through dating app : కారణాలు ఏవైనా సమాజంలో పెళ్లికాని మగవారిని లక్ష్యంగా సాగుతున్నమోసాల్లో పెళ్లిళ్లు, డేటింగ్ లు ముందుంటున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి నుంచి డేటింగ్ యాప్ ద్వారా రూ.21లక్షలు దోచుకున్న విజయవాడ జంటను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడకు చెందిన కంపా హృదయానంద్(30), అనూష అలియాస్ హారిక(20) భార్యా భర్తలు. వీరు 2017లో వివాహం చేసుకున్నారు. అనూష అంతకు ముందే మరో వ్యక్తిని వివాహం చేసుకుని అతడి నుంచి విడాకులు తీసుకుంది. హృదయానంద్ ను రెండో పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు అతని ఆరోగ్యం చెడిపోవటం… ఏపనీ చేయకపోవటంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఒక డయాగ్నస్టిక్ సెంటర్ లో ఉద్యోగంలో చేరింది అనూష. అయితే అక్కడ వచ్చే జీతంతో కుడా సరిపోకపోవటంతో డబ్బు సంపాదించే మార్గాల గురించి అన్వేషణ మొదలెట్టారు.

పెళ్లి కాని మగవాళ్లను టార్గెట్ చేసుకుంటూ డేటింగ్ యాప్ లో నకిలీ ప్రోఫైల్ క్రియేట్ చేశారు. ఇండియన్ డేటింగ్.కామ్ అనే యాప్ లో హరికా హృదయానంద్ అనే పేరుతో నకిలీ ఖాతా తయారు చేశారు. ఇంటర్నెట్ లోంచి ఒక అందమైన అమ్మాయి ఫోటో డౌన్లోడ్ చేసి దాన్ని ప్రోఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నారు. పెళ్ళి కాని మగవాళ్లు, ఎక్కువ సంపాదన ఉండి స్త్రీ వ్యామోహం ఉన్న మగవారిని గుర్తించి వారితో హృదయానంద్ మహిళ లా వ్యవహరిస్తూ చాటింగ్ చేసేవాడు. ఆ క్రమంలో నేరేడ్ మెట్ కు చెందిన డోనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తితో పరిచయం అయ్యింది.

అమ్మాయిలా మాట్లాడుతూ డోనాల్డ్ ను తన వైపు తిప్పుకున్నాడు. అమ్మాయిలా మాట్లాడటంతో డోనాల్డ్ కూడా ఆసక్తిగా హృదయానంద్ తో చాటింగ్ చేసేవాడు. కాస్త నమ్మకం పెరిగాక గుండె జబ్బుతో బాధ పడుతున్న తన తల్లి ఆపరేషన్ కి  ఆర్ధిక సహాయం చేయాలని కోరాడు. సరే అని డోనాల్డ్ డబ్బు పంపించాడు.

కొన్నాళ్లకు చికిత్స పొందుతూ తన తల్లి మరణించిందని ..సోదరి వైద్య ఖర్చులకోసం డబ్బులు పంపమని కోరారు ఈ దంపతులు. అయ్యో ఎన్ని కష్టాలో అనుకుంటూ డోనాల్డ్ మళ్లీ డబ్బులు సహాయం చేశాడు. అలా విడతల వారీగా అతని వద్దనుంచి రూ. 21 లక్షలు వసూలు చేశారు. మధ్యలో అనేక సార్లు పెళ్లి విషయం ఎత్తితే ఆ మాటను దాటేసి మిగిలిన విషయాలు మాట్లాడే వారు.

పెళ్లి   విషయాన్ని వాయిదా వేస్తూ ఉండటం…..ఆర్ధిక సహాయం చేయమని అడగటంతో అనుమానం వచ్చిన డోనాల్డ్ మోసపోయానని గ్రహించాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల  కోసం గాలింపు మొదలెట్టారు. డోనాల్డ్  కేసు పెట్టటం తెలుసుకున్న దంపతులు హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారు.  రాచకొండ పోలీసులు  చివరకు విజయవాడ వెళ్లి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించారు. డేటింగ యాప్ లు, మ్యాట్రిమోనీసైట్లు, సోషల్ మీడియా సైట్లలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.