చట్టం చేస్తే సరిపోదు, రాజమండ్రిలో బాలిక గ్యాంగ్‌ రేప్ ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 02:35 PM IST
చట్టం చేస్తే సరిపోదు, రాజమండ్రిలో బాలిక గ్యాంగ్‌ రేప్ ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అమానుషం అన్న పవన్, మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

చట్టం చేస్తే చాలదు:
తమ కూతురి ఆచూకీ తెలియడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా, సకాలంలో స్పందించ లేదని తనకు తెలిసిందన్నారు పవన్. అసెంబ్లీలో ముక్త కంఠంతో ఆమోదం పొందిన దిశ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదని పవన్ ప్రశ్నించారు. తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమండ్రిలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుందని, దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏం చేస్తోందని పవన్ అడిగారు. చట్టం చేయటం కాదు, నిబద్దతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు పవన్.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16ఏళ్ల బాలికపై బ్లేడ్ మ్యాచ్ ముఠా అరాచకంపై పవన్ తీవ్రంగా స్పందించారు. ఆ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. నాలుగు రోజులు చిత్ర హింసలు పెట్టిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్లేడ్ బ్యాచ్‌లు, డ్రగ్స్ ముఠాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

అసలేం జరిగింది? బాలిక వారికి ఎలా చిక్కింది?
ఈ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులంతా ఆవారాగాళ్లే. రోడ్లపై ఖాళీగా తిరుగుతూ దోపిడీలు చేసే బ్లేడ్ బ్యాచ్. మత్తుమందు సైతం సరఫరా చేయడం… సేవించడం వారి హాబీ. ఇలా ఆ బాలికకు మత్తుమందు ఇచ్చి… నాలుగు రోజులుగా గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానిక కోరుకొండ మండలానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కూతుళ్లు. భర్త చాలా సంవత్సరాల కిందటే చనిపోయాడు. ముగ్గురు కూతుళ్లలో రెండో కూతురు పదో తరగతి వరకు చదువుకుంది. రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానంటూ అనిత అనే స్థానిక మహిళ జూలై 12న ఆమెను తీసుకెళ్లింది. అయితే అప్పటికే అనిత మత్తు మందుకు అలవాటుపడింది. క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన బ్లేడు బ్యాచ్ యువకులతో ఆమెకు పరిచయం ఉంది.

4 రోజుల పాటు గ్యాంగ్ రేప్:
ఈ క్రమంలోనే బాలికను తీసుకెళ్లి ఆ బ్లేడు బ్యాచ్ యువకులకు అప్పగించింది అనిత. ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాజమహేంద్రవరం గోకవరం బస్టాండు దగ్గర ఓ గదికి బాలికను ఆమె తీసుకెళ్లింది. ఆ బ్యాచ్‌లోని యువకులు బాలికకు మత్తుమందు ఇచ్చారు. తర్వాత బాలికను గదిలో బంధించి నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా చిత్రహింసలు పెట్టారు. జూలై 12న సాయంత్రం ఇంటికి అనిత మాత్రమే తిరిగి వచ్చింది. దీంతో తన కూతురు ఏదని ఆమె తల్లి అడిగింది.

తనకు తెలియదని అనిత బదులివ్వడంతో ఆ తల్లి కోరుకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు 16 రాత్రి బాలికను అపస్మారక స్థితిలో చూశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక కోలుకున్నాక జరిగిన విషయమంతా వివరించింది. అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.