స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం వెనుక కుట్ర, ఆడియో రిలీజ్ చేసిన పరారీలో ఉన్న డాక్టర్ రమేశ్ బాబు

  • Published By: naveen ,Published On : August 16, 2020 / 03:02 PM IST
స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం వెనుక కుట్ర, ఆడియో రిలీజ్ చేసిన పరారీలో ఉన్న డాక్టర్ రమేశ్ బాబు

విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ లో అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటన తర్వాత రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్ బాబు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఆగస్టు 30న విచారణకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో డాక్టర్ రమేశ్ బాబు అలర్ట్ అయ్యారు. తన ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలపై ఆడియో రిలీజ్ చేశారు. ఇష్యూని ఫైర్ యాక్సిడెంట్ నుంచి అధిక ఫీజుల వసూలు వైపు మళ్లిస్తున్నారంటూ హీరో రామ్ చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి.



మా ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవం:
అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ రమేశ్ బాబు శుక్రవారం(ఆగస్టు 14,2020) ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఘటనాస్థలిలో లేకున్నా డాక్టర్‌ రాజగోపాల్‌, డాక్టర్‌ సుదర్శన్‌ను పోలీసులు నిర్బంధించడం సరికాదు. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఘటన జరిగిన ఆదివారం నాడు నేను, ఆ డాక్టర్లు ఇద్దరూ కలెక్టర్‌ ఆఫీసులో కలెక్టర్‌ సమక్షంలో విచారణలో పాల్గొన్నాం. మా ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవం. నిష్పక్షపాత న్యాయవిచారణకు ఆస్పత్రి యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పది లక్షల మందికిపైగా మా ఆస్పత్రిలో హృద్రోగ చికిత్సలు చేయించుకున్నారు. 5వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు.



బాబుని తీసేసి చౌదరి తగిలించడం బాధాకరం:
నా పేరు డాక్టర్‌ రమేశ్‌బాబు. కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో బాబుని తీసేసి చౌదరి అని తగిలించడం నాకెంతో బాధ కలిగించింది. వైద్యానికి కుల, మత, రాజకీయాలను ఆపాదించడం సమంజసం కాదు. స్వర్ణ ప్యాలె్‌సలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించాక.. చాలా మంది క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్న బాధితులు కూడా మా వైద్యసేవలతో కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అయితే అనుహ్యంగా అగ్నిప్రమాద ఘటనతో మా ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి’ అని రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.



ఆగస్టు 30న విచారణకు రావాలని నోటీసులు:
కాగా, స్వర్ణ ప్యాలెస్, రమేశ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు రిపోర్టులో వెల్లడించారు. లోపాలు ఉన్నాయని తెలిసినా స్వర్ణ ప్యాలెస్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారని అధికారులు తేల్చారు. విద్యుత్ లోపాలను సరి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. కొవిడ్ పేషెంట్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు అధికారులు రిపోర్టులో స్పష్టం చేశారు. రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ఆగస్టు 30న విచారణకు హాజరై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపారు. లేదంటే రమేశ్ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించడంతో ఇన్నాళ్లూ పరారీలో ఉన్న డాక్టర్ రమేశ్ బాబు ఓ ఆడియో ద్వారా స్పందించారు.



సామాజిక బాధ్యతతో ముందుకొచ్చాం, ఇలా జరగడం దురదృష్టకరం:
స్వర్ణ ప్యాలెస్ రిసెప్షన్, కంప్యూటర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగాయని అన్నారు. కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా భావించి వైద్యం చేయడానికి ముందుకొస్తే దురదృష్టవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని వాపోయారు. ఈ ఘటనతో పూర్తిగా తమ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా తమపై ప్రచారం జరిగిందని డాక్టర్ రమేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో రమేశ్ హాస్పిటల్ ఫ్యామిలీలోని 2వేల 500 కుటుంబాలను అయోమయానికి గురి చేస్తున్నారని రమేశ్ బాబు వాపోయారు. 30ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్ డాక్టర్లను నాలుగు రోజులుగా నిర్బంధించారని ఆరోపించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను ఇంటర్నేషనల్ కరోనా పేషెంట్లకు క్వారంటైన్ సెంటర్ గా మార్చడానికి కలెక్టర్ ఎంపిక చేయడం వల్లే మెడికల్ సేవలు అందించేందుకు అనుమతులు పొందామని రమేశ్ బాబు తెలిపారు.



ఈ షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవించింది? ఇందులో ఏదైనా కుట్ర ఉందా?
హోటల్ మెయింటెన్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ హోటల్ వారే చూసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నామని డాక్టర్ రమేశ్ తెలిపారు. పేషెంట్ మెడికల్ సర్వీసెస్ కు అవసరమైన డాక్టర్లు, నర్సులు, ఎమర్జెన్సీ షిఫ్టింగ్ అంబులెన్సు సర్వీసులకు రమేష్ హాస్పిటల్ బాధ్యత వహిస్తుందని ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. స్వర్ణ ప్యాలెస్ కు మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్, ఫైర్ పర్మిషన్ ఉన్నాయో లేవో తెలియాల్సి ఉందన్నారు. ఫైర్ పర్మిషన్ కనుక ఉంటే ఫైర్ యాక్సిడెంట్ సమయంలో పరికరాలు సక్రమంగా పని చేశాయా లేవా? ఈ షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవించింది? ఇందులో ఏదైనా కుట్ర ఉందా? అని భావిస్తున్నట్టు డాక్టర్ రమేశ్ తెలిపారు.



జగన్ గురించి హీరో రామ్ సంచలన ట్వీట్:
అటు స్వర్ణ ప్యాలెస్ ఘటనపై యంగ్ హీరో రామ్ సంచలన ట్వీట్లు చేశారు. ఫైర్ యాక్సిడెంట్ ఇష్యూని అధిక ఫీజుల వసూలు వైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అందరిని ఫూల్స్ ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్వర్ణ ప్యాలెస్ ను రమేశ్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చకముందే అక్కడ ప్రభుత్వమే క్వారంటైన్ సెంటర్ ను నిర్వహించిందని రామ్ అన్నారు. ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నిర్వహించినప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారని ప్రశ్నించారు. సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కొంతమంది జగన్ కు తెలియకుండా ఇలాంటి పనులు చేస్తున్నారని రామ్ ఆరోపించారు.



మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ రాయపాటి మమతను విచారించిన పోలీసులు మరో 9మందిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.