కాంగ్రెస్‌లో చేరడం వల్లే రాథోడ్ పరిస్థితి ఇలా మారిందా?

10TV Telugu News

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో రమేశ్‌రాథోడ్‌ పేరు తెలియని వారుండరు. 20 ఏళ్ల పాటు జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు. ఆదిలాబాదు జిల్లా జడ్పీ చైర్మన్‌గా, ఆదిలాబాదు ఎంపీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఇలా రాజకీయాల్లో చాలా అనుభవమే ఉంది. ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో నేరుగా మాట్లాడే నేతగా రమేష్ రాథోడ్‌కు పేరుంది. ఢిల్లీ స్థాయిలో పెద్దపెద్ద నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఏం లాభం.. అదంతా గతమే. ఇప్పుడు పరిస్థితులున్నీ తారుమారైపోయాయి. 

అందరితోనూ కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా గుర్తింపున్న రమేశ్‌ రాథోడ్‌.. అనతి కాలంలో రాజకీయాల్లో రాణించారు. ఆయన ప్రస్తుత పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారి చేతుల్లో ఓటమి పాలవ్వడం, గెలిచేస్తారు, మంచి వ్యక్తి, వార్‌ వన్ సైడే అనుకుంటున్న సమయంలో ఓడిపోవడం.. రమేశ్‌ రాథోడ్‌ను కలిచి వేస్తోందట. ప్రజల మనిషిగా పేరున్నప్పటికీ ఆ బలం తన విజయానికి సరిపోవడం లేదంటున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే రాజకీయాలలో ఉండకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గెలుస్తారనకుంటే ఓడిపోయారు :
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రమేష్ రాథోడ్.. తెలంగాణ ఏర్పడిన సమయంలో ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జరిగిన ఎన్నికలలో టీడీపీ టికెట్‌పై ఆదిలాబాదు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ హామీతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశించి, భంగపడ్డారు. ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ కేసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు రమేశ్‌ రాథోడ్. ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి ఏకపక్షంగా ఆయనే గెలుస్తారని ప్రచారం జరిగినా ఓడిపోయారు. 2019లో లోక్‌సభకు ఆదిలాబాదు నుంచి నుంచి పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి గెలిచారు. 

కాంగ్రెస్‌లో చేరడం వల్లనే :
అప్పటి నుంచి ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నానేది టాక్‌ నడుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రమేశ్‌ రాథోడ్ కాంగ్రెస్‌లో చేరడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో ఆయన పార్టీ అనవసరంగా మారారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రమేశ్‌ రాథోడ్ తన కుమారుడు రితీశ్‌ రాథోడ్‌ను రాజకీయాల్లో నిలదొక్కుకునేలా చేయడంలో బిజీ అవుతున్నారట.

కొడుకుకి ఒక మార్గం చూపిస్తే ఇక తాను విశ్రాంతి తీసుకోవచ్చని భావిస్తున్నారట. 2014లో తొలిసారిగా ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన రితీశ్‌ రాథోడ్  ఓడిపోయారు. అయినా యువకుడు కాబట్టి నిలదొక్కుకోవచ్చని భావిస్తున్నారట. మరి రమేశ్‌రాథోడ్‌ ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయన మౌనంగా ఉండిపోయారు.