పదేళ్ల బాలికపై ముగ్గురు పోకిరీల అత్యాచారయత్నం, పైగా వేధింపులు.. బాధితురాలి తండ్రి ఆత్మహత్యాయత్నం

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 11:12 AM IST
పదేళ్ల బాలికపై ముగ్గురు పోకిరీల అత్యాచారయత్నం, పైగా వేధింపులు.. బాధితురాలి తండ్రి ఆత్మహత్యాయత్నం

rape attempt on minor girl: చేసిందే పాడుపని.. సభ్య సమాజం తలదించుకునే పని.. మత్తులో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. నిజం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు ముగ్గురు కామాంధులు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో.. బాధితురాలి తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు ప్రాంతానికి చెందిన బాలికపై ఆగస్టులో ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. షాపుకు వెళ్లిన బాలికను బైక్‌పై ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసి వారి నుంచి తప్పించుకొని ఇంటికి చేరింది.

దీనిపై బాలిక కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేయడంలో ఆలస్యం వహించారు. మహిళా సంఘాల ఒత్తిళ్లతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. అత్యాచారయత్నం చేసిన ముగ్గురు నిందితులు కందికట్ల చందు, కందికట్ల సిద్ధు, జీవన్‌లను అరెస్ట్‌ చేశారు.

అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. పోలీసులు అరెస్ట్‌ చేసిన ముగ్గురిపై కేసు విత్‌ డ్రా చేసుకోవాలంటూ బాధిత కుటుంబంపై వేధింపులు మొదలయ్యాయి. రాజీకి రాకపోతే చంపేస్తామంటూ నిందితుల స్నేహితులు బెదిరించారు. బాలికతో పాటు ఆమె తల్లిని కూడా లైంగికంగా వేధించారు.

డ్రగ్స్, మద్యానికి అలవాటుపడిన కొంతమంది యువతను ఉసిగొలిపి మైనర్ బాలికతో పాటు ఆమె తల్లిని కూడా వేధించారు. డ్రగ్స్‌ మత్తులో తల్లి స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు.

దీనిపైనా బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. మళ్లీ పోలీస్ స్టేషన్‌ కు ఎందుకు వెళ్లారంటూ వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన చావుకు ముగ్గురు యువకులు, వారి స్నేహితులే కారణమని సూసైడ్‌ నోట్ రాశాడు.

బాలిక తండ్రి షేక్‌ సత్తార్‌ పురుగుల మందు తాగడం గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన అతడ్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

తన కుమార్తెపై అత్యాచారం చేయడమే కాకుండా తమ కుటుంబాన్ని రెండు నెలలుగా వేధిస్తున్న పోకిరీలను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతోంది. అయితే ఈ కేసుపై మాట్లాడేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. పై అధికారుల ఒత్తిళ్లతో మొదటి నుంచి ఈ కేసులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబం న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది.