Kachidi Fish : ఈ చేప ఖరీదు రూ.2.60లక్షలు.. చిక్కిందా జీవితమే మారిపోతుంది..

అదృష్టం వరిస్తే అది కచిడి (kachidi) చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగే.

Kachidi Fish : ఈ చేప ఖరీదు రూ.2.60లక్షలు.. చిక్కిందా జీవితమే మారిపోతుంది..

Kachidi Fish

Kachidi Fish : అదృష్టం వరిస్తే అది కచిడి (kachidi) చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగే. లోతైన సముద్ర జలాల్లో దొరికే ఇవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు సిరులు కురిపించాయి. స్థానిక మత్స్యకారుడు సింగరాజు సముద్రంలో వేట సాగించగా వారి వలలో కచిడి చేప పడింది. దానిని రేవుకి తీసుకొచ్చి వేలం వేయగా రూ.2.60 లక్షలకు ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. మరో మత్స్యకారుడు జగన్నాథం వలకు చిక్కిన కచిడి చేపకు కుంభాభిషేకం రేవులో వేలంపాట నిర్వహించగా రూ.2.40 లక్షలు పలికింది. ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి వినియోగిస్తారు. అందుకే అంత ధర పెట్టి కొనుగోలు చేస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

పులస చేప తినాలంటే అదృష్టం ఉండాలంటారు. ఎందుకంటే అది చాలా అరుదుగా దొరుకుతుంది. పైగా ఖరీదెక్కువ. అందుకే అంటారు పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని. పులస చేప విషయం కాసేపు పక్కన బెడితే.. కచిడి చేప గురించి చెప్పుకోవాలి. పులసలా ఇది కూడా చాలా అరుదుగా మత్స్యకారులకు చిక్కుతుంది. దీని ధర గురించి విన్నారంటే మైండ్ బ్లాక్ అవుతుంది.

గోదావరి నదిలో దొరికే పులస చేపకు డిమాండ్ ఎంత ఉంటుంది..? మహా అయితే వేలల్లో ఉంటుంది. కానీ సముద్రంలో దొరికే కచిడి అనే ఈ చేపకు మాత్రం ధర లక్షల్లో పలుకుతుంది. ఎందుకంటే ఈ చేపలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా కచిడి చేపలు 30 కిలోల కంటె ఎక్కువగా కూడా తూగుతాయి. మొత్తానికి ఈ కచిడి చేప దొరకడంతో మత్స్యకారుడు లక్షాధికారయ్యాడు.

ఈ చేపకు ఎందుకంత డిమాండ్.. ఇందులో ఏముంది?
సాధారణంగా కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే భావిస్తారు. తమకు సిరులు కురిపిస్తుందని చెబుతుంటారు. ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది.

కచిడి చేపలో ఔషధ గుణాలు:
ఈ కచిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారట. ఇక ఖరీదైన వైన్స్‌లో కూడా ఈ చేపను వేయడంతో ఆ వైన్‌ ధర ఎక్కువగా పలుకుతుందని ఈ చేప గురించి పూర్తిగా తెలిసిన వారు చెబుతున్నారు. కచిడి చేపల పొట్టభాగం ఒక్కటే రూ.80వేల వరకు ధర పలుకుతుందట. పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వినియోగిస్తారట. మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో ఉండటంతో వీటిని బంగారు చేపలని కూడా పిలుస్తారు. ఈ చేప కోసం గంగపుత్రులు తెగ ప్రయత్నాలు చేస్తుంటారట. ఎవరికైతే ఇది దొరుకుతుందో వారి బతుకు చిత్రమే మారిపోతుందని చెబుతున్నారు. అందుకే ఈ చేప ఎంతో ప్రత్యేకత అని చెబుతున్నారు.