కోటి రూపాయలు పొగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి, ఆన్‌లైన్ రమ్మీపై జగన్ ప్రభుత్వం నిషేధం విధించడానికి కారణం ఇదే

  • Published By: naveen ,Published On : September 3, 2020 / 03:11 PM IST
కోటి రూపాయలు పొగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి, ఆన్‌లైన్ రమ్మీపై జగన్ ప్రభుత్వం నిషేధం విధించడానికి కారణం ఇదే

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ జూదంపై నిషేధం విధించింది. ఆన్ లైన్ లో పేకాట, రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను బ్యాన్ చేస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గేమింగ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఆన్ లైన్ లో జూద క్రీడలు ఆడుతూ, నిర్వహిస్తూ దొరికితే కఠినమైన శిక్షలు విధిస్తారు.

రమ్మీ ఆడితే జైలు శిక్ష:
ఆన్ లైన్ లో జూదం ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు:
కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆన్ లైన్ పేకాట పై చర్చ జరిగింది. ఆన్ లైన్ విప్లవం అనేది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనుకుంటే, కొందరు డబ్బు కోసం ఆన్ లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీ, పోకర్‌పై నిషేధం విధించాలని నిర్ణయించారు. ఇకపై ఆన్ లైన్ లో ఎవరైనా రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను ఆడినా, నిర్వహించినా పట్టుబడితే.. వారికి జరిమానా, శిక్ష విధిస్తారు.

ఆన్ లైన్ జూదం ఆడితే జైలు శిక్ష, జరిమానా:
ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే, ఆన్ లైన్ లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.

ఆన్ లైన్ రమ్మీపై ప్రభుత్వం నిషేధం విధించడం సంచలనం అనే చెప్పాలి. అసలు జగన్ ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీపై ఎందుకు బ్యాన్ విధించింది? అనేది ఆసక్తికరంగా మారింది. రమ్మీ లాంటి ఆన్ లైన్ జూద క్రీడలతో చాలామంది డబ్బులు పోగొట్టుకొని, సైబర్ మోసాలకు గురి అవుతున్న క్రమంలో ఆన్ లైన్ జూద క్రీడలపై నిషేధం విధించింది. అలాగే ఆన్ లైన్ రమ్మీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సదరు సంస్థలపై ఉక్కుపాదం మోపే దిశగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో వ్యసనంగా మారిన ఆన్ లైన్ రమ్మీ, రూ.కోటి పొగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి:
కరోనా లాక్ డౌన్ సమయంలో కృష్ణా జిల్లా నూజివీడులో ఒక బ్యాంకు ఉద్యోగి కోటికిపైగా మోసం చేసి ఐపీ పెట్టారు. ఇంతకీ బ్యాంకు ఉద్యోగి కోటి రూపాయలకు పైగా డబ్బులు ఏం చేశారన్నది ఆరా తీస్తే ఆయన ఆన్ లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన ఏకంగా రెండు నెలల్లో రూ.కోటికిపైగా ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి ఓడిపోవడం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఇక విజయనగరంలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా సరే అప్పులు తీరలేదు. ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్‌లైన్‌ రమ్మీ ఆడటానికే అని తెలిసి ఆ కుటుంబం లబోదిబోమంది.

13 ముక్కల పేకాట ఓ మాయాజాలం:
ఆన్‌లైన్‌ రమ్మీ మాయాజాలం అంటే అదే మరి. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. దేశంలో కోట్లాది మందిని ఆన్‌లైన్‌ రమ్మీ భూతం కమ్మేస్తోంది. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది. అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ మాయాజూదంలో ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.

ఈ తరహా మోసాలు ఏపీలో విపరీతంగా జరిగాయంటే ఆన్ లైన్ రమ్మీ ఎంత వ్యసనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆన్ లైన్ రమ్మీతో మోసపోయిన వారు కేసులు పెడుతున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రమ్మీకి బానిసలవుతున్న ప్రజలను కాపాడడం కోసం జగన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

వందల కోట్ల గ్యాంబ్లింగ్:
గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరుతో ఆన్ లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశమంతటా ఆన్ లైన్ రమ్మీ నిర్వహణ జోరుగా సాగుతోంది. ముంబై, బెంగళూరు తదితర కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున రమ్మీ నిర్వహణ సంస్థలు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రమ్మీ వల్ల గ్యాంబ్లింగ్ మాయలోపడి ఏటా వందల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా పిల్లలు, యువత వారికి తెలియకుండానే రమ్మీకి బానిసలవుతున్నారు. మొదట్లో రమ్మీలోకి దిగిన వారు ఆటల్లో గెలుస్తారు. దాంతో వారికి డబ్బు ఆశ చూపించి, ఆ తర్వాత క్రమంగా వారి డబ్బులు కొల్లగొట్టే కార్యక్రమం ఆన్ లైన్ రమ్మి ద్వారా కొనసాగుతోంది.

ఇక గ్యాంబ్లింగ్ సంస్థలపై ఉక్కుపాదమే:
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీ పై నిషేధం విధిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై రమ్మీ నిర్వహించే సంస్థలు.. ఏపీలోని ఐపీ అడ్రస్ నుంచి ఆటకు అనుమతించకూడదు. ఒకవేళ అలా అనుమతిస్తే సదరు ఆన్ లైన్ రమ్మీ సంస్థపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు నిషేధం లేకపోయేసరికి రమ్మీలో డబ్బు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేని పరిస్థితి లేదు. అయితే ఇక ముందు అలా కాదు. ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీ వంటి జూద క్రీడలపై బ్యాన్ విధించింది కనుక.. ఇక గ్యాంబ్లింగ్ సంస్థల ఆటలు సాగవు. వాటిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వానికి మార్గం ఏర్పడింది.

నిషేధం విధిస్తే గ్యాంబ్లింగ్ సంస్థలను ఇలా కట్టడి చేయొచ్చు:
* నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్‌లైన్‌ రమ్మీ సంస్థలు ఆడించకూడదు. ఆటగాళ్ల ఐపీ అడ్రస్‌ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుస్తుంది. నిషేధిత రాష్ట్రాల వారు ఉంటే వారిని ఆటకు ఆనుమతించకూడదు.
* నిషేధం లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మోసం చేశారని నిరూపించడం కష్టం.
* షేధం విధిస్తే ఆన్‌లైన్‌ సంస్థలు ఆ రాష్ట్రాల వారిని అసలు ఆడించనే కూడదు. ఆడించినట్టు తెలిస్తే కేసు నమోదు చేయవచ్చు. ఆన్‌లైన్‌ రమ్మీ నిర్వహణ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ కేసు దర్యాప్తు చేసి దోషులను శిక్షించవచ్చు.

ఏటా రూ.7,500 కోట్లు హుష్‌కాకీ:
ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఫెడరేషన్‌ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్‌లైన్‌ రమ్మీ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఫెడరేషన్‌ లెక్కల ప్రకారం దేశంలో ఆన్‌లైన్‌ రమ్మీలో ఏటా రూ.7వేల 500 కోట్లు చేతులు మారుతున్నాయి. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు రూ.2వేల 500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి.

* మరి మిగిలిన రూ.5 వేల కోట్లు ఎటు వెళ్తున్నాయని సైబర్‌ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఆన్‌లైన్‌ రమ్మీలో గెలిచిన వారికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్న 30 కోట్ల మందిలో కనీసం ఒక శాతం మంది అధికారిక ఖాతాలు, ఆదాయ పన్ను వివరాల్లో అయినా ఆ మొత్తం కనిపించాలి కదా అన్నదే సైబర్‌ నిపుణుల సందేహం.
* తాము ఓడిపోయాం.. అవతల ఎవరో గెలిచారని ఆడిన వాళ్లు భావిస్తూ ఉంటారు. అవతల గెలిచిన వారు ఎవరూ ఉండరని, కొన్ని సంస్థలే కంప్యూటర్ల ద్వారానో.. తమ మనుషుల ద్వారానో ఆడిస్తూ మోసానికి పాల్పడుతూ ఆ రూ.5 వేల కోట్లు కొల్లగొడుతున్నాయన్నది సైబర్‌ నిపుణుల సందేహం.

రాష్ట్రాల వారీగా నిషేధమే మార్గం:
* కావాలని ఆడి మోసపోతుండటంతో బాధితుల నుంచి అధికారికంగా ఫిర్యాదులు తక్కువగా ఉంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కష్ట సాధ్యమవుతోందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. కానీ రాష్ట్రాలు తమ పరిధిలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించడానికి అవకాశం ఉంది.
* కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాయి. ఆన్‌లైన్‌ రమ్మీ నియంత్రణ విధివిధానాలను రూపొందించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.
* సిక్కిం, నాగాలాండ్‌ రాష్ట్రాలు ఆన్‌లైన్‌ రమ్మీకి అధికారికంగా ఆనుమతి ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో అనుమతి ఉన్నట్టుగానే పరిగణిస్తున్నారు.

రమ్మీ వ్యసనం నుంచి బయటపడటానికి ఇదొక్కటే మార్గం:
* ఆన్‌లైన్‌ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గం.
* ఒకసారి ఆ ఆటకు అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి కూడా ఆడాలని ప్రయత్నించకూడదు.
* ఆన్‌లైన్‌ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు.

* ఈ దిశగా పిల్లలకు అవగాహన కల్పించాలి.
* వ్యసనపరులకు కౌన్సెలింగ్‌ ఇప్పించాలి అని నిపుణులు చెబుతున్నారు.