అసలు కారణం అదేనా : జనసేనకు CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 01:27 PM IST
అసలు కారణం అదేనా : జనసేనకు CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో

జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ నిలకడలేని విధానాల కారణంగానే జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు లక్ష్మీనారాయణ.

అసలు కారణం ఏంటి..?
లక్ష్మీనారాయణ నిర్ణయం జనసేన శ్రేణుల్లోనే కాదు.. ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ప్రజా సేవ కోసం తాను నటనకు పూర్తిగా స్వస్తి చెబుతానని గతంలో అనేకసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారని… కానీ ఆయన మళ్లీ నటించాలని నిర్ణయించుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్‌లో నిలకడైన విధానాలు లేవని తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్టు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

ఎన్నికల తర్వాత పెరిగిన దూరం:
ప్రజాసేవకే అంకితం అవుతానని మాటిచ్చిన పవన్.. మళ్లీ సినిమాల్లో నటించడం వల్లే తాను జనసేనకు రాజీనామా చేశానని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. అదే కారణం అంటున్నారు. కానీ.. అసలు కారణం అది కాదని మరో రీజన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. లక్ష్మీనారాయణ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో జనసేన సైతం ఘోరంగా ఓడింది. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ పరాజయం చూశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి లక్ష్మీనారాయణ.. జనసేనకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

బీజేపీతో పొత్తే కారణమా..?
ఇక రీసెంట్ గా పవన్ తీసుకున్న కీలక నిర్ణయాలు.. లక్ష్మీనారాయణను బాగా బాధించాయట. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపీలో బీజేపీతో కలిసి పని చేయాలని పవన్ నిర్ణయించారు. పలు మార్లు ఢిల్లీ వెళ్లిన పవన్… బీజేపీతో పొత్తు కుదుర్చుకుని వచ్చారు. అయితే బీజేపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్.. లక్ష్మీనారాయణను సంప్రదించలేదట. కనీసం మాట కూడా చెప్పలేదట. తనతో మాట కూడా చెప్పకుండానే.. పవన్ చాలా పెద్ద పెద్ద కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని.. లక్ష్మీనారాయణ ఫీల్ అయ్యారట. పార్టీ తీరు, పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ కారణంతోనే లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్-లక్ష్మీనారాయణ జోడీ సక్సెస్ అవుతుందని అనుకున్నారు:
పవర్ ఫుల్, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా, సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ ఫుల్ క్రేజ్ సంపాదించారు. జగన్ ఆస్తుల కేసులను డీల్ చేయడం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. సీబీఐ జేడీ పదవికి రాజీనామా చేశాక రాజకీయాల్లోకి వచ్చారు లక్ష్మీనారాయణ. ముందు టీడీపీలో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత లోక్ సత్తాలోకి వెళ్తారని వార్తలొచ్చాయి. బీజేపీలోకి వెళ్తారని కూడా వార్తలు వినిపించాయి. చివరికి అవేవీ కాదని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో జాయిన్ అయ్యారు. పవన్, లక్ష్మీనారాయణ.. ఇద్దరూ కలవడంతో జనసేనకు ఓ ఊపు వచ్చింది. జేడీ జాయిన్ కావడంతో జనసేనకు హైప్ వచ్చింది. పవన్, మాజీ జేడీ జోడీ సూపర్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. పవన్-మాజీ జేడీ జోడీ సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు.

గతంలోనే రాజీనామా వార్తలు:
కానీ.. ఎన్నికల ఫలితాల్లో జనసేన ఘోర పరాజయం చూసింది. జనసేన తరుఫున విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత లక్ష్మీనారాయణ పార్టీకి దూరం అయ్యారు. జనసేన కార్యక్రమాలకు కానీ అంతర్గత మీటింగ్ లకు కానీ హాజరుకావడం లేదు. పవన్ తో లక్ష్మీనారాయణకు విభేదాలు వచ్చాయని, దూరం పెరిగిందని, జనసేనకు రాజీనామా చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత సద్దుమణిగింది. ఈసారి మాత్రం.. లక్ష్మీనారాయణ జనసేనకు రిజైన్ చేసేశారు.