పార్టీకి దూరంగా పత్తిపాటి పుల్లారావు, జగన్ టార్గెట్ నుంచి తప్పించుకోవడానికేనా?

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 05:39 PM IST
పార్టీకి దూరంగా పత్తిపాటి పుల్లారావు, జగన్ టార్గెట్ నుంచి తప్పించుకోవడానికేనా?

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావుది కీలక పాత్ర. పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు రాజకీయాల్లో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటమే కాక, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేయటంతో అప్పటి నుంచి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ మొదలు అన్ని వ్యవహారాల్లోనూ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావులే కీలకంగా వ్యవహరించారు.

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు:
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేసిన పుల్లారావు.. జిల్లాలో పార్టీ శ్రేణులందరికి దగ్గరయ్యారు. జిల్లా పార్టీలో ఎంతమంది నేతలున్నా అధినేత చంద్రబాబుతోపాటు, ఆయన కుమారుడు లోకేశ్‌.. పుల్లారావుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పార్టీలో నేతలు చెబుతుంటారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పరిస్థితి తలకిందులైంది. వైసీపీ తరఫున బరిలోకి దిగిన విడదల రజిని చేతిలో ఓటమి పాలయ్యారు పుల్లారావు.

అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల తీర్పుపై ఆయన గుర్రుగా ఉన్నారట. అందులోనూ తన అనుచరవర్గమే మోసం చేయటం, ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితం తారు మారు కావడాన్ని పుల్లారావు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట.

చేతులారా ఓటమిని కొనితెచ్చుకున్నారు:
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు పుల్లారావు ఓటమికి ఒకటా రెండా.. అనేక కారణాలున్నాయి. మంత్రి పదవి వెలగబెట్టిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని గాలికొదిలేయడం ఒకటైతే.. నియోజకవర్గంపై పెత్తనాన్ని సతీమణికి అప్పజెప్పడం మరొకటి. ఆమె సాగించిన అక్రమ వ్యవహారాలన్నింటికీ వంత పాడడం, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కేడర్‌ను పట్టించుకోకపోవటంతో ఎన్నికల్లో ఓడిపోయారని చెబుతారు. ఎన్నికల అనంతరం కొద్ది నెలలు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌గా వ్యవహరించిన పుల్లారావు… ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమవుతూ వస్తున్నట్లు పార్టీలో టాక్‌.

ఆ భయంతోనే సెలైంట్ అయ్యారా?
గడచిన ఏడు నెలలుగా పుల్లారావు అసలు జిల్లా కేడర్‌కు అందుబాటులో లేకుండా పోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజధాని భూసేకరణ సమయంలో ఇన్ సైడ్‌ ట్రేడింగ్ వ్యవహారం, సీఐడీ దర్యాప్తు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉచ్చు బిగుసుకుంటుందన్న కారణంగానే పుల్లారావు పాలిటిక్స్‌లో సైలెంట్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది మొదలు పుల్లారావు జిల్లాలోని పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకుండా పోయారు. జగన్ టార్గెట్ లిస్ట్‌లో పుల్లారావు ఉన్నారన్న సమచారంతోనే ముందు జాగ్రత్తగా సర్దుకున్నారనే ప్రచారం జోరందుకుంది.

పుల్లారావు తీరుపై రైతులు ఆగ్రహం:
రాజధాని మార్పు ప్రకటన అనంతరం ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో తొలినాళ్లలో చురుకుగా పాల్గొన్న పుల్లారావు.. ఆ తర్వాత కన్నెత్తి కూడా చూసింది లేదని రాజధాని రైతులు అంటున్నారు. రాజధాని కోసం ఒత్తిడి తెచ్చి మరీ భూములను ఇప్పించిన పత్తిపాటి పుల్లారావు.. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తమ వెన్నంటి నిలవకపోవడంపై రైతులు గుర్రుమంటున్నారు.

తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేయడం వారికి అస్సలు నచ్చడం లేదంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి టీడీపీలోని క్షేత్ర స్ధాయి కార్యకర్తలు పోరాడుతుంటే వారికి నాయకత్వం వహించాల్సిన పత్తిపాటి ఇలా ముఖం చాటేయటం ఏంటని పార్టీలోని పలువురు నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారట.

తనను కాపాడుకునేందుకు వైసీపీ పెద్దలతో రాయబారాలు:
గత కొద్ది నెలలుగా పుల్లారావు హైదరాబాద్‌కే పరిమితమైనట్లు చెప్పుకుంటున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ వ్యవహారంలో తనను తాను కాపాడుకునేందుకు, తన జోలికి రాకుండా ఉండేందుకు వైసీపీలోని కీలక పెద్దలతో రాయబారాలు నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారని, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు సాగాయనే టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల్లో కార్యకర్తలు తనకు ద్రోహం చేశారని, తానెందుకు నియోజవర్గంలో అందుబాటులో ఉండాలని పలువురు సన్నిహితుల వద్ద పుల్లారావు అంటున్నారని చెప్పుకుంటున్నారు.

అధికార పార్టీ ఒత్తిళ్ళకు తలొగ్గి జెండా మార్చేస్తారా?
కరోనా కారణంగానే హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని, త్వరలోనే నియోజకవర్గానికి వచ్చి జిల్లా రాజకీయాల్లో దూకుడు పెంచుతానని మరికొంత మంది సన్నిహితుల వద్ద పుల్లారావు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

మరి ఆయన కేసులకు భయపడే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా? అధికార పార్టీ ఒత్తిళ్ళకు తలొగ్గి జెండా మార్చేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రచారాలు, అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే స్వయంగా పుల్లారావు బయటకొచ్చి అసలు విషయం చెప్పాలని కార్యకర్తలు అంటున్నారు.