ఉల్లి ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? ఎప్పుడు అదుపులోకి వస్తాయి? | reasons behind onion price soars

ఉల్లి ధరలకు రెక్కలు, సెంచరీ క్రాస్.. ఉల్లి ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? ఎప్పుడు అదుపులోకి వస్తాయి?

ఉల్లి ధరలకు రెక్కలు, సెంచరీ క్రాస్.. ఉల్లి ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? ఎప్పుడు అదుపులోకి వస్తాయి?

onion price soars : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 90 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దాటి నాన్‌స్టాప్‌గా ఉల్లి ధర పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉల్లి కొనాలంటేనే కన్నీ ళ్లు పెట్టే పరిస్థితులొచ్చాయి. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో సరుకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. చుక్కలతో జతకడుతున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిని కొనలేకపోతున్నారు. వంటింటి నిత్యావసర సరుకైన ఉల్లి ధర అమాంతం పెరిగిపోవడతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉల్లిని కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ధరాఘాతంతో పేద, మధ్యతరగతి వాళ్లు అవస్థలు పడుతున్నారు.

ఓవైపు వానలు, మరోవైపు బ్లాక్ మార్కెట్:
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉల్లి ధరల ఘాటు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో కొనాలనుకున్నవారు పావుకిలో, అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. సెప్టెంబర్‌ చివరి దాక 10, 15 రూపాయలు పలికిన ఉల్లి ధర.. అక్టోబర్‌ మొదట్లో 20కి పెరిగింది. ఈ నెలలో ఏకంగా మూడుసార్లు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర 90 రూపాయలు పలుకుతోంది. ఈ మధ్య కురుస్తున్న వానలతో మహారాష్ట్రలో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో కూడా వర్షాలకు రైతులు ఉల్లి పంటను కోల్పోయారు. వ్యాపారులు ఉల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితులలో ప్రజలు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిపాయలు పంపిణీ చేస్తే.. తప్ప సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపించడం లేదు.
https://10tv.in/krishna-district-kg-mutton-low-price-at-people-angry-on-one-day-offer/
పంట రావటానికి ఇంకా రెండు నెలల సమయం:
బహిరంగ మార్కెట్‌లో వారం రోజుల క్రితం కిలో ఉల్లిపాయల ధర 40 రూపాయలు ఉండేది. వారం రోజుల్లోనే ఆమాంతం 85 నుంచి 90కి చేరింది. నిజానికి ప్రకాశం జిల్లాకు మహారాష్ట్రలోని నాసిక్‌, బెంగళూరు, కర్నూలు జిల్లా నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. జిల్లాలోని మార్టూరు మండలంలోని పలు గ్రామాలలో ఉల్లి సాగు జరుగుతోంది. జిల్లాలోని పంట రావటానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 100 టన్నుల ఉల్లిపాయలు అవసరం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలలో ఎక్కువగా ఉల్లిపాయలను ఉపయోగిస్తుంటారు. గత నెలలో కురిసిన వర్షాలకు మహారాష్ట్రలో ఉల్లి పంట మొత్తం నాశనమైంది.

పంట నష్టంతో ఉలి ధరలకు రెక్కలు:
కర్నూలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు ఉల్లి రైతులు పండించిన పంటను కోల్పోయారు. ఎక్కువ శాతం దిగుమతులు మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉంటాయి. ఆ ప్రాంతాలలో పంట నష్టపోవటంతో ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి. కొందరు వ్యాపారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర అమాంతం పెంచేస్తున్నారు. కోల్డ్‌ స్టోరేజీలలో ఉన్న సరుకును అధిక ధరలలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఉల్లి ధర కొండెక్కడంతో .. అంత మొత్తం పెట్టి కొనేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటేనే అదుపులోకి ధరలు:
ప్రజలు నిత్యం ఉపయోగించే ఉల్లిపాయల ధరలు పెరగటానికి వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌ చేయడమే కారణంగా కనిపిస్తోంది. 2019లో పెరిగిన ఉల్లి ధరలను దృష్టిలో ఉంచుకొని కొందరు వ్యాపారులు ఉల్లిపాయల స్టాక్‌ను కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెటింగ్‌ శాఖ అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉండటంతో వ్యాపారులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. హోల్‌ సేల్‌ వ్యాపారులు, రిటైల్‌ వ్యాపారులకు ఉల్లిపాయలు లాభాల పంట పండిస్తోంది. మార్కెటింగ్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వచ్చే ఛాన్స్ ఉంది.

రైతు బజార్ లో కిలో ఉల్లి రూ.20కి విక్రయం:
ఉల్లిపాయల ధరలు పెరుగుతుండంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం సరఫరా చేసే ఉల్లిపాయల వైపు చూస్తున్నారు. 2020 జనవరి, ఫిబ్రవరిలో ఉల్లిపాయల కిలో ధర 180 రూపాయలకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై ఉల్లిపాయలు సరఫరా చేసింది. కిలో ఉల్లిపాయలు 20 రూపాయలకు రైతు బజార్‌లలో విక్రయించారు. ఆధార్‌ కార్డును నమోదు చేసుకుని ఒక్కరికి కిలో చొప్పున ఉల్లిపాయలు సరఫరా చేశారు. దీంతో ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. తరువాత కాలంలో ఉల్లిపాయల ధరలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాలలో వాటిని కొనుగోలు చేయటానికి ప్రజలు ముందుకు రావటం లేదు. చాలావరకు కూరలో ఉల్లిపాయలు వేయటమే మానేశారు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు 90 చేరడంతో ఏం కొంటాం, ఏమి తింటామని కొందరు గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లిపాయల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు:
ఉల్లిపాయల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు. వారం రోజులుగా కిలో ఉల్లిపాయలు 70 నుంచి 90 పెరిగింది. రానున్న వారం రోజులలో 100 నుంచి 120 రూపాయలకు పెరిగే అకాశాలు కనిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉల్లిపాయలు కొంటున్నారు. ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కొనే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది.
దిగుబడులు పడిపోవడం కూడా కారణమే:
ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉల్లి పంట ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతి కందకపోవడంతోనే ధరలు భగ్గుమటున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో మార్కెటుకు రవాణా కావడం లేదని అంటున్నారు ఉల్లి వ్యాపారులు. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న ఉల్లి దిగుబడులు అంతగా నాణ్యతమైనవిగా ఉండటం లేదంటున్నారు వ్యాపారులు. కారణమేదైనా ఉల్లి ధరలు చుక్కలనంటుతుండడంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు.

×