Red Sandal Smuggling : ఎర్రచందనం స్మగ్లింగ్ కు కందకాల తవ్వకంతో చెక్

Red Sandal Smuggling : ఎర్రచందనం స్మగ్లింగ్ కు కందకాల తవ్వకంతో చెక్

Red Sandal

Check with trench excavation for red sandalwood smuggling :  ఎర్రచందనం స్మగ్లింగ్ కు కందకాల తవ్వకంతో చెక్…అటవీసంపద రక్షణ కోసం అటవీశాఖ బహుళ ప్రయోజన వ్యూహం.. అటవీరక్షణ, ఎర్రచందనం పరిరక్షణలో అత్యంత కీలకం కానున్న కందకాల తవ్వకాలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు.

అటవీ ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో జలసిరుల సంరక్షణకు కూడా కందకాలు ఉపయోగపడతాయి. శేషాచలం అడవుల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు మూడు లేయర్ల ద్వారా నీరు భూమిలో ఇంకుతుంది. తద్వారా కందకాల పరిధిలోని బోర్లు, చెరువులు, కుంటల్లో నీరు చేరుతుంది. వన్యప్రాణులకు తాగునీరు అందుతుంది. ఏనుగులు అడవిదాటి వచ్చి పంట పొలాలపై దాడులు చేయడాన్ని అడ్డుకుంటాయి.

ఎర్రచందనం స్మగ్లర్లు కందకాలను దాటి వాహనాలతో అడవిలోకి వెళ్లకుండా నిరోధకంగా మారుతాయి. శేషాచలం అడవుల చుట్టూ కందకాలు తవ్వడం ద్వారా అటవీ సంపదను సంరక్షించుకోవచ్ఛు పరిసర గ్రామాలపై వన్యప్రాణుల దాడులను అరికట్టవచ్ఛు సరిగ్గా ఇదే ఆలోచనతోనే అటవీశాఖ పదేళ్ల క్రితం కందకాలు తవ్వే పనిని ప్రారంభించింది.

ఆపై శేషాచలం చుట్టూనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అడవుల చుట్టూ తవ్వాలని నిర్ణయించుకుంది. జిల్లాలోని తిరుపతి సర్కిల్‌ పరిధి(చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు)లోని అడవుల చుట్టూ సుమారు 165 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వే పనులను చేపట్టి రెండేళ్ల క్రితం పూర్తి చేశారు.

మళ్లీ గత నెల తిరుపతి సర్కిల్‌ పరిధిలోని బాలపల్లె అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అరుదైన, అంతరించి పోతున్న అటవీ సంపద ఎక్కువ భాగం తిరుపతి డివిజన్‌ పరిధితోపాటు, సర్కిల్‌ పరిధిలోని బాలపల్లె రేంజ్‌ పరిధిలో ఉంది.

ఈ కారణంగా గతంలో ఆగిపోయిన చోటి నుంచే తిరిగి తవ్వేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతి డివిజన్‌ పరిధిలో 45 కిలోమీటర్ల మేర ఇప్పటికే కందకాల తవ్వకం పూర్తిచేశారు. 20 అడుగులకు ఒకటి చొప్పున వరుసగా మూడు వరుసలుగా 3 మీటర్లు వెడల్పు, 10 అడుగుల లోతుతో కందకాలను తవ్వుతారు.

ఇప్పటికే తిరుపతి డివిజన్‌ పరిధిలో చామలరేంజ్‌ పరిధి శ్రీవారిమెట్టు నుంచి మామండూరు వరకు తవ్వారు. మామండూరు నుంచి బాలపల్లె అటవీ ప్రాంతం, కోడూరు, రాజంపేట అటవీ పరిధిలోని రిజర్వు అటవీ ప్రాంతం సరిహద్దులో కందకాలు తవ్వేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. రాష్ట్ర అటవీశాఖతోపాటు కంపా నుంచి కూడా నిధులను రాబట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.