ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసు, భాషా భాయ్ అరెస్టు

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 01:40 PM IST
ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసు, భాషా భాయ్ అరెస్టు

Bashabhai Arrest : కడప జిల్లా గోటూరు రోడ్డు ప్రమాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాషా భాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లోకల్ గ్యాంగు ఇచ్చిన సమాచారంతో..బెంగళూరులో భాషా భాయ్ ను అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా భాషాభాయ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భాషా భాయ్ కి చెందిన గ్యాంగ్ తమిళ స్మగ్లర్ల ను వెంబడించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.



ఒకే వ్యక్తి చక్రం తిప్పాడా ? 
ఎర్రచందనం లోడుతో వెళ్తున్న తమిళ స్మగ్లర్ల కారును వెంబడించిన లోకల్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళ స్మగ్లర్లను వెంబడించిన కడప, రాయచోటి, పెళ్లి మర్రికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవ దహనం అయిన ఘటనలో ఒకే వ్యక్తి చక్రం తిప్పాడా ? ఎర్రచందనం వృక్షాలను నరికించి స్మగ్లింగ్ చేయించింది ఆ బడా స్మగ్లరేనా ? ఎర్రచందనం దుంగలతో వెళుతున్న తమిళ కూలీల వాహనాన్ని వెంబడించిన గ్యాంగ్ కు కూడా ఆ వ్యక్తే సూత్రధారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు గోటూరు రోడ్డు ప్రమాదంపై తలెత్తుతున్నాయి.



ట్విస్టుల మీద ట్విస్టులు
ఈ కేసులో రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూటకో ట్విస్ట్‌తో క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది గోటూరు రోడ్డు ప్రమాదం కేసు.. అయితే ఈ కేసు మొత్తం వెనుక అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బాషా భాయ్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బాషా భాయ్ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ఈ కేసును ఛేదించడానికి 5 ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేపట్టారు.



లోకల్ గ్యాంగు ఇచ్చిన సమాచారంతో 
ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో తిరిగి కీలక సమాచారం సేకరించారు. అయితే తమిళ స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న స్కార్పియోను వెంబడించిన ఇటియోస్ కార్ లో కడప జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కడప, రాయచోటి, పెండ్లిమర్రి మండలాలకు చెందిన ఈ ముగ్గురు వ్యక్తులను ప్రత్యేక పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ లోకల్‌ గ్యాంగ్‌ ఇచ్చిన సమాచారంతోనే అంతర్జాతీయ స్మగ్లర్ బాషా భాయ్ ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



ఇద్దరూ ఒకటే ? 
తమిళ కూలీలతో ఎర్రచందనం దుంగలను తరలించే ఒప్పందం కుదుర్చుకుని, వారికి కూలీ డబ్బులు ఎగ్గొట్టడం కోసమే స్మగ్లర్‌ బాషాభాయ్‌.. తనకు అనుకూలమైన మరో ముఠాతో హైజాక్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎర్రచందనం స్మగ్లర్ , హైజాక్ ముఠాకు నాయకత్వం వహించిన వ్యక్తి ఇద్దరూ ఒకటేనని పోలీసులు భావిస్తున్నారు.



కీలక వ్యక్తులు అరెస్టు
ఓపక్క ఎర్రచందనం స్మగ్లింగ్ మరోపక్క లోకల్ ముఠాలతో దాడులు చేయించడం ఆ స్మగ్లర్ కు వెన్నతో పెట్టిన విద్యగా పోలీసులు భావిస్తున్నారు. ఎర్రచందనం కూలీలు సజీవ దహనం కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.