Job calendar : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల

Job calendar : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల

Release Of Job Calendar On Andhra Pradesh

AP Job calendar : 2021-22 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 10 వేల 143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం ఆయన క్యాలెండర్ ను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ..ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. అందులో నిరుద్యోగ యువతకు కూడా హామీలిచ్చారు. నిరుద్యోగ యువత ఆకాంక్షకు అనుగుణంగా.. దశలవారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను విడుదల చేస్తామని వెల్లడించింది. తాజాగా..క్యాలెండర్ ను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం.

ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు భర్తీ చేస్తారనే డిటైల్ తో జాబ్ క్యాలెండర్‌ను సీఎం జగన్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్‌1, గ్రూప్‌2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్‌ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో కొత్త విధానాన్ని రూపొందించనున్నారు.

విద్య, వైద్య, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా… ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయనే విషయంపై వివరాలు సేకరించింది. వాటికి సంబంధించిన పోస్టులు, వాటి భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌‌ను అధికారులు రూపొందించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను పేర్కొనడంతో పాటు వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు.. వాటికి సంబంధించి నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందనే స్పష్టమైన వివరాలన్నీ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, డీఎస్సీ లాంటి నియామక సంస్థల ద్వారా జులై నుంచి ప్రతీ నెలా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. నియామక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

జగన్ సర్కార్ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెండేళ్ల కాలంలో.. 6 లక్షల 3వేల 756 ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడిస్తోంది ప్రభుత్వం. అందులో రెగ్యులర్‌ పోస్టులు లక్షా 84వేల 264, కాంట్రాక్టు పోస్టులు 19వేల 701, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3 లక్షల 99వేల 791 ఉన్నాయి.

ఏపీ జాబ్ క్యాలెండర్