AP NIT Director CSP Rao : రుజువైన అవినీతి ఆరోపణలు .. ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ

ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్పీ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావటంతో శుక్రవారం (సెప్టెంబర్ 23,2022) రాష్ట్రపతి కార్యాలయం నుంచి రావును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

AP NIT Director CSP Rao : రుజువైన అవినీతి ఆరోపణలు .. ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ

Removing AP NIT Director CSP Rao Orders are issued from the office of the President

Removing AP NIT Director CSP Rao : ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్పీ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావటంతో శుక్రవారం (సెప్టెంబర్ 23,2022) రాష్ట్రపతి కార్యాలయం నుంచి రావును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రావును తొలగింపుతో రాష్ట్రపతి నాగపూర్ నిట్ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ మధుకర్ కు ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు.

2018లో నిట్‌ డైరెక్టర్‌గా నియమితులైన సీఎస్పీ రావుపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై సీబీఐ, ఏసీబీ సంయుక్తంగా విచారణ చేపట్టగా..ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో సీఎస్పీ రావును మార్చి 30న సస్పెండ్‌ కు గురి అయ్యారు. అప్పటి నుంచి రావు నిట్‌ క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఆరోపణలు నిరూపితం కావడంతో అధికారులు రాష్ట్రపతికి నివేదిక అందజేశారు. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు నాగపుర్‌ విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డా.ప్రమోద్‌ మధుకర్‌ పడోలెను ఏపీ నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. సీఎస్పీ రావును తిరిగి వరంగల్‌ నిట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

కాగా..సీఎస్పీ రావు నిట్‌ డైరెక్టర్‌గా ఉంటూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ, అనర్హులకు ఉద్యోగాలిచ్చారని సీబీఐ ఫిబ్రవరి 16న రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. నిట్‌కు పీఆర్వో పోస్టు మంజూరు కాకపోయినా దానిని భర్తీ చేశారని.. సూపరింటెండెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకంలో వయసు నిబంధనను పాటించలేదని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. వీరేశ్‌కుమార్‌ అనే వ్యక్తికి వయోపరిమితి సడలించి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారని వెల్లడించింది

నిట్‌కు క్యాటరింగ్‌ సర్వీస్‌ చేసే అవకాశమిచ్చినందుకు ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌ అనే సంస్థ నుంచి లంచం తీసుకొన్నారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. పీహెచ్‌డీ గైడ్‌గా వ్యవహరించినందుకు ఎన్‌.విష్ణుమూర్తి నుంచి రూ.1.50 లక్షలు, ఒక వ్యాయామ పరికరాన్ని లంచంగా తీసుకున్నారని తెలిపింది. లంచాలుగా తీసుకున్న సొమ్మును వేరే ఖాతాల్లోకి మళ్లించారని వెల్లడించింది. సీఎస్పీ రావుతో పాటు పీఆర్వో రాంప్రసాద్, సూపరింటెండెంట్‌లు చెక్కలపల్లి అన్నపూర్ణ, కాపాక గోపాలకృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ వీవీ సురేష్‌బాబు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరేష్‌కుమార్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ధనలక్ష్మి, ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌ నేరెళ్ల సుబ్రహ్మణ్యం, ఎన్‌.విష్ణుమూర్తిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.