రైట్ రైట్ : ఏపీ – తెలంగాణ మధ్య RTC సర్వీసులు ?

  • Published By: madhu ,Published On : June 5, 2020 / 06:26 AM IST
రైట్ రైట్ : ఏపీ – తెలంగాణ మధ్య RTC సర్వీసులు ?

ఏపీ, తెలంగాణ మధ్య త్వరలో బస్సు సర్వీసులు  ప్రారంభం కానున్నాయా…? అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నాయా…? 2020, జూన్ 08వ తేదీ సోమవారం నుంచే బస్సులు పరుగులు తీయనున్నాయా…? అవుననే అనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వనప్పటికీ ఏపీ మాత్రం బస్సులు తిప్పేందుకు సిద్ధమవుతోంది. సోమవారం నుంచి వేరే రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు RTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అన్‌లాక్‌ 1 లో భాగంగా కేంద్రం అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిచ్చింది. బస్సులు తిప్పేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఇప్పటికే ఏపీలో బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.

అయితే పొరుగు రాష్ట్రాలకు మాత్రం తిప్పడం లేదు. కేంద్రం అనుమతించిన వెంటనే బస్సులు తిప్పాలని అధికారులు భావించినప్పటికీ… ప్రయాణికులకు పరీక్షలు చేయడం, వారి వివరాలు సేకరించడం కష్టంగా మారుతుందని భావించిన ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. దానికి తగ్గట్లుగా కార్యాచరణను రూపొందించి బస్సులు తిప్పేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు కూడా అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ 4 లోనే తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు నడిపేందుకు APSRTC అధికారులు ప్రయత్నించారు. తెలంగాణ నుంచి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 13వేల మందిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎక్కువగా కరోనా కేసులున్న తమిళనాడు ఇతర రాష్ట్రాల సర్వీసులను అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనపై రాష్ట్రాలు ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రీన్‌సిగ్నల్ వస్తే సోమవారం నుంచే బస్సులు పరుగులు తీయనున్నాయి. 

Read: 10tv కథనానికి స్పందన : డబ్బులు ఇవ్వొద్దు..ఉచితంగా ఇళ్ల స్థలాలు : మంత్రి శ్రీరంగనాథ రాజు