తూర్పుగోదావరి జిల్లాలో బోల్తా పడిన లారీ… మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

  • Published By: bheemraj ,Published On : November 22, 2020 / 11:08 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో బోల్తా పడిన లారీ… మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

Rolling lorry Driver cleaner burnt alive : తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మారేడుపల్లి వద్ద శనివారం రాత్రి లారీ బోల్తాపడింది. మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. డ్రైవర్ మృతదేహాన్ని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్లీనర్ మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.



నిన్నరాత్రి 7 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో లారీ అదుపు తప్పి వాలు పై నుంచి ఘాట్ రోడ్డులో పడిపోయింది. లారీ బోల్తా పడిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తి దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. డ్రైవర్ ఖమ్మంకు చెందిన గోపిగా, లారీ చర్ల ప్రాంతానికి చెందినదిగా అధికారులు గుర్తించారు.



మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే మార్గం సుమారు 50 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన మలుపులో నైపుణ్యం గల డ్రైవర్ అయితేనే ప్రయాణం చేయగలరు. లారీ అదుపు తప్పి ఘాట్ రోడ్డుపై నుంచి కిందికి ఘాట్ రోడ్డులో పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.