ఏపీలో బస్సులు రయ్.. రయ్..?! ఎప్పుడంటే?

  • Published By: srihari ,Published On : May 19, 2020 / 03:05 AM IST
ఏపీలో బస్సులు రయ్.. రయ్..?! ఎప్పుడంటే?

ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు త్వరలో రోడెక్కనున్నాయి. ఏపీలో బస్సు సర్వీసులపై మూడు నాలుగు రోజుల్లో స్పష్టత రానుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సర్వీసులకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచి నడపాలన్నది మూడు నాలుగు రోజుల్లో నిర్ణయించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు, కోవిడ్‌–19 నివారణ చర్యలు, బస్సు సర్వీసులు నడపడం, వలస కూలీలను స్వస్థలాలకు తరలింపు తదితర అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని షాపులు తెరిచేందుకు అనుమతి. ప్రతి దుకాణం వద్ద ఐదుగురిని మాత్రమే అనుమతించాలి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవే‌కు అనుమతి మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉంటుంది. కరోనా పట్ల ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియ జేయడంపై దృష్టి సారించాలని సూచించారు. వార్డు క్లినిక్స్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. అన్ని ఆరోగ్య సమస్యలకు విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా మంచి పరిష్కారం లభిస్తుందని తెలిపారు.  అంతర్‌ రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలనే అంశంపై కూడా సీఎం చర్చించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రావాలనుకుంటున్న వారి కోసం బస్సులు నడపడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని సీఎం నిర్ణయించారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు సర్వీసులు నడపాలన్నారు. మధ్యలో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి లేదని చెప్పారు. బస్టాండ్‌లో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు.. అతను వెళ్లాలనుకుంటున్న చిరునామా తీసుకోవాలి. తద్వారా అవసరమైతే ఆ వ్యక్తి ట్రేసింగ్‌ సులభం అవుతుంది. వలస కార్మికుల తరలింపు పూర్తి కాగానే బస్సు సర్వీసులు నడపాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

Read:

ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం, ప్రైవేట్ ట్రావెల్స్ కూ అనుమతి, కొత్త నిబంధనలు ఇవే

రాష్ట్రంలోనే కాదు..బైట రాష్ట్రాలకు కూడా బస్సులు నడపేందుకు అన్నీ రెడీ : మంత్రి పేర్ని నాని