వారిద్దరి డీఎన్‌ఏ ఒక్కటే.. నిమ్మగడ్డ భాష సరికాదు: సజ్జల

వారిద్దరి డీఎన్‌ఏ ఒక్కటే.. నిమ్మగడ్డ భాష సరికాదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. అధికార పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా నిమ్మగడ్డపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మలా మారారని, ఎన్నికల కమిషనర్ కీలుబొమ్మలా వ్యవహరించడం మంచిది కాదని మండిపడ్డారు. నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తోందని, రిటైర్డ్ అధికారి అయ్యి ఉండి ఇతర అధికారులతో వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు.

ఎత్తుకు పైఎత్తు వేస్తూ చవకబారు ధోరణిలోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, ఎన్నిక విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని.. ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామిగా మారారని అన్నారు.

ఎన్నికల విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీనియర్ అధికారుల పట్ల ఎస్‌ఈసీ వాడిన భాష సరికాదని, చంద్రబాబు, నిమ్మగడ్డ డీఎన్‌ఏ ఒక్కటేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా జనవరి 16న సీఈసీ ఓటర్ల జాబితా విడుదల చేసింది..గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత ఎన్నికలు జరపలేమని నిమ్మగడ్డకు కూడా తెలుసు.. అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు.

ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి…ఒక్క ఓటు ఉన్నా నామినేషన్ వేయాలి అని చంద్రబాబు అనడం దేనికి సంకేతం? పార్టీలకు రహితంగా ఉన్న ఎన్నికల్లో ఎందుకు అంత ఘీంకరించడం? ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా? గతంలో కూడా జరిగాయి కదా? నిమ్మగడ్డ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఆయనపై గౌరవం పోయిందని సజ్జల అన్నారు.