ప్రాణాలతో చెలగాటం : ఏపీలో నకిలీ మందుల విక్రయం

ప్రాణాలతో చెలగాటం : ఏపీలో నకిలీ మందుల విక్రయం

sale of counterfeit drugs in AP : దీర్ఘకాలిక రోగాలు, సీజనల్‌ వ్యాధులు, వైరస్‌లకు మందులు వాడుతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నెలకొందిప్పుడు. ఏపీలో నకిలీ మందులను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు కొంతమంది మెడికల్‌ షాపుల యజమానులు. చండీఘడ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి ఈ మందులు దిగుమతి అవుతున్నట్లు ఏపీ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు. దీంతో రహస్య విచారణ చేపట్టారు. ఎక్కువ కమీషన్లకు ఆశపడి ఏపీలో నకిలీ మందులను విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై అధికారులు కొరఢా ఝులిపించారు.

రోగులు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజులుగా డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పలు నగరాలు, పట్టణాల్లోని మెడికల్‌ షాపుల్లో సోదాలు చేశారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, పాలకొల్లులో డూప్లికేట్‌ మందులను గుర్తించారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడే నాణ్యతలేని మందులు.. బహిరంగ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవడంపై అధికారులే విస్తుపోయారు.

కరోనా కాలంలో అజిత్రోమైసిన్‌కి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో అజిత్రోమైసిన్‌ నకిలీ మందులను తయారుచేసేశారు అక్రమార్కులు. ఉత్తరాఖండ్‌, చండీఘడ్‌లో … అజిత్రోమైసిన్‌, సిఫిక్సిమ్ కాంబినేషన్‌లో ఆరు రకాల నకిలీ మందులు తయారైనట్లు అధికారులు గుర్తించారు. వాటిని ల్యాబ్‌ టెస్ట్‌కు పంపిస్తే పూర్తి నకిలీ మందులని తేలింది. ఈ తనిఖీల్లో మూడు లక్షల రూపాయల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, పాలకొల్లులో పలువురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

నకిలీమందుల తయారీచేస్తున్న కంపెనీలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఏపీ డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ ఆదేశాల మేరకు.. నకిలీ మందులు తయారీ అవుతున్న రాష్ట్రాలకు ఆరుగురు అధికారులతో కూడిన రెండు బృందాలు తరలివెళ్లాయి. పూర్తి విచారణ పూర్తయ్యాక కఠినచర్యలు తీసుకోనున్నారు.