తిరుమల శ్రీవారి లడ్డూలు మే 31 నుంచి హైదరాబాద్ లో అమ్మకం

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 07:59 AM IST
తిరుమల శ్రీవారి లడ్డూలు మే 31 నుంచి హైదరాబాద్ లో అమ్మకం

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ  రేపు ఆదివారం నుంచి హైదరాబాద్ లోని భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో గత 67 రోజులకు పైగా స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. 

భక్తులకు శ్రీవారి ఆశీస్సులు ప్రసాదం రూపంలో అయినా అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ బోర్డు నిర్ణయించిందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా రూ.25 లకే లడ్డూను భక్తులకు అందించనున్నారు. 

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా లడ్డూ ప్రసాదం విక్రయిస్తామని సుబ్బారెడ్డి వివరించారు. లడ్డూ విక్రయాలకు టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో భక్తుల కోసం 60 వేల లడ్డూలు నగరానికి చేరుకున్నాయి.  

కాగా టీటీడీ లడ్డూలుదేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మాలని    తీసుకున్న నిర్ణయంపై భక్తులనుంచి మిశ్రమ స్పందన వచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తమకు అందుబాటులోకి వచ్చిందని కొంత మంది భక్తులు ఆనందిస్తుంటే… మరికొందరు మాత్రం టీటీడీ తీరును విమర్శిస్తున్నారు. అతి  పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అంగట్లో సరుకులా అన్ని ప్రాంతాల్లో విక్రయించడం ఏంటంని మరికొందరు ఆక్షేపించారు. 

Read: ఆస్తుల అమ్మకంపై TTD పాలక మండలి కీలక నిర్ణయం