చంద్రబాబు చేయలేనిది నేను చేశా, ఇప్పుడేమంటారు బాబాయ్

  • Published By: naveen ,Published On : July 30, 2020 / 03:08 PM IST
చంద్రబాబు చేయలేనిది నేను చేశా, ఇప్పుడేమంటారు బాబాయ్

పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి రాదు, అనర్హురాలు అన్నారు. ఇప్పుడు అదే అమ్మాయి ఘన విజయం సాధించింది. రూ.53 కోట్ల కేంద్ర నిధులను తీసుకొచ్చింది. ఆ నిధులతో సింహాచలాన్ని ప్రపంచ నెంబర్ వన్ టెంపుల్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

అంతే కాదు, ఆమె చైర్ పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత చేసిన కృషికి, ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కూడా కురిపించింది. ఈ నేపధ్యంలో ఇప్పుడేమంటారు బాబాయ్ అంటోంది సంచయిత. ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి సీట్లో కూర్చోబెట్టారని ఇంతకాలం ఆడిపోసుకున్న వారు ఇకనైనా మౌనాన్ని ఆశ్రయిస్తారనుకుంటాను అంటూ ట్వీట్ చేశారు సంచయిత.

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో ఆయన సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐదేళ్లపాటు చక్రం తిప్పారు. బీజేపీతో దోస్తీ చేసి మరీ వారూ మేమూ ఒక్కటే అన్నారు. మరి ఆనాడు సింహాచలానికి కేంద్ర నిధులు ఎందుకు తేలేకపోయారు అంటూ సంచయిత లాజిక్ పాయింట్ లాగారు. ఇప్పుడేమంటారు బాబాయ్ అంటూ సంచయిత చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తన తొలి విజయాన్ని, ధీమాను తెలియచేస్తోందని, అందరి సాయంతో సింహాచలాన్ని తన పదవీకాలంలో పూర్తిగా అభివృద్ధి చేస్తానని సంచయిత మరోసారి స్పష్టం చేశారు.

అసలు విషయం ఏంటంటే, విశాఖ సింహాచలం దేవాలయానికి కేంద్రంలో కీలక ప్రాధాన్యత దక్కింది. నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌(ప్రసాద్‌) ప‌థ‌కానికి సింహాచ‌లం దేవస్థానాన్ని ఎంపిక చేసింది కేంద్రం. దేవాలయ అభివృద్దికి గానూ రూ.53 కోట్లు విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఏపి టూరిజం శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

దీనిపై సింహచలం దేవస్థానం చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు. కేంద్ర టూరిజం శాఖ ప్రసాద్ స్కీమ్ లో విశాఖ సింహాచలం దేవాలయం చేర్చడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆమె. దేశవ్యాప్తంగా ఐదు దేవాలయాలను గుర్తిస్తే, అందులో సింహాచలంను చేర్చినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఙతలు చెప్పారు. మార్చి నెలల ఇదే విషయంపై కేంద్ర టూరిజం శాఖ మంత్రిని కలిసి ప్రాధాన్యతను వివరించానని అన్నారు. నేను చేసిన కృషి ఫలించిందని… గతంలో కేంద్రమంత్రిగా ఉన్నా గత చైర్మన్ అంటూ (అశోక గజపతి రాజుని ఉద్దేశించి), చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.

అశోక్ గజపతిరాజుపై సంచయిత ఫైర్ అయ్యారు.. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండి కూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రసాద్‌ స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేదని నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని అడిగారు. మన్సాస్‌ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కూడా సంచయిత తప్పుపట్టారు.

”కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. ప్రసాద్ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానం ఎంపిక‌కావడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చి నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని‌ కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశా. ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలకి సమాధానం చెబుతాను” అని సంచయిత అన్నారు.