సరికొత్త క్రాంతి : సంక్రాంతి సంబరాలు, పల్లెలు కళకళ, ఇళ్ల ముంగిట రంగవల్లులు

సరికొత్త క్రాంతి : సంక్రాంతి సంబరాలు, పల్లెలు కళకళ, ఇళ్ల ముంగిట రంగవల్లులు

Sankranthi Celebrations Telugu States : తెలుగు వారందరికి సంక్రాంతి పెద్ద పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ పండుగ. తెలుగు లోగిళ్లలో ఆనంద హేల లాంటిది. దేశవ్యాప్తంగానూ ఈ పండగకు ప్రాధాన్యత ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనే పదం ‘సంక్రమణము’ అనే మూలం నుంచి పుట్టింది. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అందుకే గ్రామీణ భారత ప్రాంతాల్లో జరుపుకునే దీన్ని రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులే గుర్తుకొస్తాయి. సంక్రాంతి రోజున ప్రతి ఇంటీ ముంగిలీలో రంగవల్లులు శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి చాలా ప్రాధాన్యముంది. చిన్నారులు ఎగరేసే గాలిపటాలు పండుగకు మరో అట్రాక్షన్. సంక్రాంతి రోజున మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి.