ఆన్ లైన్ లో కొక్కొరొక్కో

సంక్రాంతి కోళ్లు ఆన్‌లైన్‌ కూత కూస్తున్నాయి. నువ్వా...నేనా...సై....అంటూ

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 09:32 AM IST
ఆన్ లైన్ లో కొక్కొరొక్కో

సంక్రాంతి కోళ్లు ఆన్‌లైన్‌ కూత కూస్తున్నాయి. నువ్వా…నేనా…సై….అంటూ

సంక్రాంతి కోళ్లు ఆన్‌లైన్‌ కూత కూస్తున్నాయి. నువ్వా…నేనా…సై….అంటూ సిస్టం నుంచే కాలు దువ్వుతున్నాయి. పందెం కోళ్లను అమ్మేందుకు కొందరు పోర్టల్స్‌నే అడ్డాగా చేసుకున్నారు. పైకి మామూలు కోళ్లని చెబుతున్నా రేట్లు చూస్తే మాత్రం కోసుకుతినే కోడికి అంతా …అన్న డౌట్‌ రావడం మాత్రం ఖాయం. సంక్రాంతి సీజన్‌లో పందెం కోడికి ఉండే డిమాండే వేరు. ఆ టైంలో పందేనికి వెళితే ఉండే కిక్కే వేరు. ఈ కిక్కు కోసమే లక్షలకు లక్షలు ఖర్చుచేస్తుంటారు. మొదట్లో నేరుగా స్పాట్‌లో పందేలు కాసేవారు తర్వాత టెక్నాలజీ పెరిగి ఆన్‌లైన్‌ పందేలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి పందెం కోళ్లనే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. కాకిడేగ, ఎర్రడేగ, సీతువ, నెమలి, పచ్చకాకి, పింగరాల… ఇలా ఏది కావాలన్నా సరే… క్లిక్‌ కొట్టండి కోడిని పట్టండి అంటున్నారు ఆన్‌లైన్‌ వ్యాపారులు. పందెం రాయుళ్ళు బాగా ఇష్టపడే అన్ని రకాల కోడి పుంజులను పోర్టల్‌లో పెట్టేస్తున్నారు. వీటి ధర 200 నుంచి 30వేల రూపాయలు ఉంటుంది. పందెం కోళ్లను పోర్టల్‌లో అమ్ముతున్నారని పోలీసులు పట్టుకోకుండా సాధారణ వ్యాపారంలా నమ్మించేందుకు రెండు వందలు, ఐదు వందల రూపాయల కోళ్లను పెడతారు.

కానీ అక్కడి నుంచి లోపలికి వెళితే అసలు బిజినెస్‌ తెలుస్తుంది. కాకిడేగ వంటి డిమాండ్‌ ఉన్న పుంజుల ధర 30వేలకు పైమాటే… తెలివి మీరిన కోళ్ల అమ్మకందారులు తమ దగ్గరున్న పుంజుని మూడు నాలుగు యాంగిల్స్‌లో ఫోటోలు తీసి ఓఎల్‌ఎక్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అడ్రస్‌ ఇవ్వకుండా కేవలం ఫోన్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఎవరైనా ఫోన్‌ చేస్తే వివరాలన్నీ కనుక్కుని నమ్మకం కుదిరితేనే అడ్రస్‌ చెబుతున్నారు. లేదంటే ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో ముందే సంక్రాంతి పండగ చేసుకుంటున్నారు కోడి పుంజుల వ్యాపారులు. మొత్తంగా కోళ్ల వ్యాపారులు టెక్నాలజీని వాడుకుంటూ..ప్రజలను ఎట్రాక్ట్ చేస్తున్నారు. క్లిక్ కొట్టండి కోడిని పట్టండంటూ లక్షలకు లక్షలు దండుకుంటున్నారు.