తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు..తెల్లవారుజాము నుంచే భోగి మంటలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు..తెల్లవారుజాము నుంచే భోగి మంటలు

Sankranti celebrations in Telugu states..Bhogi fires from early morning : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని అందరూ కోరుకుంటున్నారు.

సంక్రాంతి తెలుగు లోగిళ్ళల్లో పెద్ద పండగ. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా కుటుంబం అంతా ఒక్కటై చేసుకునే పండగ. కుటుంబ సభ్యుల కోలాహలం, గంగిరెద్దుల ఆటలు, చిన్నారులకు భోగి పళ్ళు, ఆడపిల్లల కోలాటాల సందడి, చుక్కల ముగ్గులు, కొత్తబట్టలు మూడు రోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి.

సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది, అందులో పిల్లలకి బాగా నచ్చేది గాలిపటాలు ఎగరేసే పండుగ. ఎంతో ఆనందాన్ని కోలాహలం కలిగించే ఈ పండుగ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంలో తెలుగువారికి ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి. ముచ్చటగా మూడు రోజులు జరిగే ఈ పండుగకి భోగి, మకర సంక్రాంతి, కనుమ అనే పేర్లతో జరుపుకుంటారు.

కోస్తాంధ్ర, రాయలసీమలో సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్లు రాకలతో పల్లెలు సందడిగా మారాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడే వేరుగా ఉంటుంది. పతంగుల కోలాహలం, కోడి పందేలు జోరు ఈ పండుగకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇప్పటికే పట్టణాల నుంచి పల్లెలకు క్యూ కట్టారు జనం.. సొంతూళ్లలో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి గ్రామాలకు తరలివెళ్తున్నారు. పల్లెలకు వెళ్లే ప్రయాణికులతో బస్‌ స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోయాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ రద్దీ కనిపిస్తోంది. ప్రజలంతా పల్లె బాట పట్టడంతో.. అటు పట్టణాలన్నీ బోసిపోతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు భోగి పండగను పల్లెల్లో ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భోగి మంటలు వేసి, ఆ భోగి మంటలు చుట్టూ డాన్సులు వేస్తూ సందడి చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా కలసి ఉదయం నుంచే సంక్రాంతి సందడిని మొదలు పెట్టేశారు.